గత అనుభవాలో ఏమో తెలియదు కానీ, నిన్న మొన్నటి వరకు జనసేనాని పవన్‌పై ఉన్న నమ్మకాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు కోల్పోతున్నారనే వాదన బాహాటంగానే వినిపిస్తుండడం గమనార్హం. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్న బీజేపీ నేతలు కూడా ఇదే వ్యాఖ్యలు అంటున్నారట. ఇప్పుడు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజుకు కేంద్రం పెద్దలు..ఇదే విషయంపై హితబోధ చేశారట. “నువ్వు ఎంతవరకు నమ్ముతావో.. ఏమో తెలీదు కానీ, పవన్‌ను మాత్రం అతిగా విశ్వసించకు. ఆయనకున్న ఓటు బ్యాంకు మాట అలా ఉంచితే.. మనం సొంతగా ఎదిగేందుకు ఉన్న మార్గాలనే అన్వేషించు“ అని పాఠం చెబుతున్నారని తెలిసింది.
అంతేకాదు, గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన తప్పులను కూడా చెప్పుకొస్తున్నారట. కేంద్రంలోని నేతలతో ఎదురు వెళ్లవద్దని, వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు సాగాలని కూడా సోముకు సూచించారట. పవన్ విషయాన్ని తీసుకుంటే.. రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆకుల సత్యనారాయణ వంటివారు కూడా సోముకు ఇప్పటికీ మిత్రులుగానే ఉన్నారు. ఆయన కూడా పవన్ గురించి కొన్ని కీలక సూచనలు చేశారట. ఎన్నికల సమయం వరకు బీజేపీతోనే ఉన్నప్పటికీ. పవన్ మూడ్ ఎలా మారుతుందో చెప్పలేం., కాబట్టి ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారట. ఎవరు చెప్పినా..కూడా పార్టీని సొంతంగా డెవలప్ చేయాలనే చెబుతున్నారట.
కాగా, ప్రస్తుతం పవన్ బీజేపీతో కలిసి ఉన్నారు. కానీ, ఈ విషయంలో జనసేనలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మనం అన్ని వర్గాల వారినీ కలుపుకొని వెళ్తున్నాం. కానీ, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం. వారు కూడా బీజేపీకి ఓట్లేయరు. ఇలాంటి పార్టీతో మనం అంటకాగాల్సిన అవసరం ఏంటి? పైగా ఇప్పుడు రాజధాని గ్రామాల్లో మనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడి ప్రజలు మనను విశ్వసించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ మనకు రాజధాని జిల్లాల్లోనే మెజారిటీ ఓటట్లు పడ్డాయి. ఈ విషయాన్ని గమనిస్తే.. ఎప్పటికైనా బీజేపీతో మనకి మంచిదికాదు..అనే భావన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చిత్రం ఏంటంటే..ఈ విషయాలు కూడా సోముకు చేరిపోయాయి. దీంతో ఆయన తనదారిలో తాను పార్టీని డెవలప్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.