వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట! ఇప్పుడు కూడా ఆయన రాజధాని విషయంలో తనదగ్గర వున్న అన్ని అస్త్రాలను వెలికితీస్తున్నారు. ఇప్పటికే నిరసనలు, ధర్నాలు, దీక్షల పేరుతో రాజధానిలో రైతుల రూపంలో ఉద్యమాలు చేయిస్తున్నారనేది వాస్తవం. దీనికి ప్రధాన కారణం.. తన పేరు చెదిరిపోకుండా.. చరిత్ర పుటల్లో తన పేరు చిరిగిపోకుండా కాపాడుకోవడమేనని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు శాసన మండలిలో తమకు బలం ఉంది కనుక తాము అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు ఆయన టీం.. ఇప్పుడు ఈవిషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తున్నా.. మరో కీలకమైన వ్యూహానికి తెరదీశారు.
రాజధాని ఆందోళనలు 100వ రోజుకు చేరిన నేపథ్యంలో వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన చంద్రబాబు.. ఇక, తాము చేసేది పూర్తయిందని.. ప్రధాని నరేంద్ర మోడీనే దీనిని కాపాడాలని ప్రకటించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. పోనీ.. మోడీ అయినా పట్టించుకుంటారని అనుకున్నారు. కానీ, ఎందుకో.. రాజధాని విషయంలో కేంద్రం ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసింది. తమకు రాజధానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా వైఎస్సార్ సీపీ నేతలకు ఊపు ఇచ్చింది. ఇంతలో చంద్రబాబు మరో వ్యూహానికి తెరదీశారు.. ప్రస్తుతం మూడు రాజధానుల(అభివృద్ధి వికేంద్రీకరణ) బిల్లు, ఏపీసీఆర్‌డీఏ రద్దు బిల్లులు గవర్నర్ హరిచందన్ వద్దకు చేరిపోయారు.
ఆయన రేపో.. మాపోవాటిని పరిశీలించి ఆమోదిస్తే.. తాము ఇన్నాళ్లు చేసిన ప్రయత్నాలు, ఉద్యమాలు నీరుగారడం ఖాయమని చంద్రబాబు భావించారు. ఈక్రమంలోనే అనూహ్యంగా రాష్ట్రపతి పేరును తెరమీదికి తెచ్చారు. బహుశ ఇదే ఆఖరు అస్త్రమై ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అసలు రాష్ట్ర రాజధానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, కేంద్ర చట్టం ప్రకారం రాజధాని ఏర్పడింది కాబట్టి.. ఈ విషయంలో కేంద్రం, లేదా రాష్ట్రపతి అనుమతి అవసరమనే కొత్త వాదనను తెరమీదికి తెచ్చారు.
ఈ క్రమంలోనే ఆ రెండు బిల్లులను రాష్ట్రపతి చెంతకు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే.. ఆయన ఆమోదిస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. మరికొన్నాళ్లు జాప్యం జరుగుతుందనేది టీడీపీ వ్యూహం. మరి జాప్యం జరిగితే.. ఎన్నాళ్లు? అనేది ఎవరూ చెప్పలేని విషయం. కొన్నికొన్ని సార్లు ఇది ఏళ్లు కూడా పట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉండే పరిచయాలను వాడుకుని వీటిని ప్రొలాంగ్ చేయొచ్చు. అనేది బాబు వ్యూహంగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.