వర్షం.. అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లకైతే మరీ ఇష్టం. వాన కురిసిన ప్రతిసారి వర్షంలో తడుస్తూ ఆడుకోవాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు మందలించడంతో ఇంటికే పరిమితమవుతారు. ఒక్కసారి వాన తగ్గగానే బయటకు పరుగులు తీస్తారు. వరద నీటిలో పడవలు వేస్తూ సంబుర పడిపోతారు. కానీ వర్షం పడేటప్పుడైనా.. వాన తగ్గిన తర్వాత కూడా పిల్లలు బయటకు వెళ్తే వెంట తల్లిదండ్రులు ఉండాల్సిందే. ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ వీడియో చూడండి.. వానా కాలంలో పిల్లలను ఒంటరిగా పంపడం ఎంత ప్రమాదమో మీకే తెలుస్తుంది.
వర్షం పడేటప్పుడు గానీ
పడ్డాక కానీ పిల్లల్ని బయటకి
వొంటరిగా పంపకండి 🥺🙏🏻
కింద వీడియో చూస్తేనే
కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయ్
మీ పిల్లలు జాగ్రత్త ప్లీజ్ 🙏🏻🙏🏻 pic.twitter.com/8xULun5FKm— ✒ అభినవ్ కృష్ణ 𓊿⃝🖤 (@Nee_Nimsaare) July 22, 2022
వానాకాలంలో ఆదమరిస్తే, అప్రమత్తంగా లేకపోతే విద్యుత్తు ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. వర్షంలో నాని తడి చేతులతో విద్యుత్తు స్తంభాలను తాకడం, ఇంట్లో ఉపకరణాలకు ముట్టుకోవడం వల్ల కరెంట్ షాక్‌తో మృత్యువాత పడే అవకాశముంది. నడిచే బాటలోనే వీధి దీపాల స్తంభాలు, రింగ్ మెయిన్ యూనిట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు అడుగడుగునా ఉన్నాయి. చాలావరకు ఫ్యూజు బాక్స్‌లకు కవర్లు లేక తీగలన్నీ బయటకు వేలాడుతుంటాయి. నియంత్రికల వద్ద చెత్తాచెదారం, తీగలతో అధ్వానంగా ఉంటాయి. పిల్లలకు వీటి గురించి తెలియక ముట్టుకునే ప్రమాదముంది. అందుకే వానాకాలంలో పిల్లలను బయటకు పంపించొద్దు.
చిన్న చినుకు పడగానే రోడ్లన్ని చిత్తడైపోతాయి. కొద్దిపాటి వానకే రహదారులపైకి నీరు చేరి రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. ఆ వరద నీటిలో మ్యాన్‌హోల్ ఎక్కడుందో.. గుంతలెక్కడున్నాయో కనిపించవు. ఇలాంటి సమయంలోనూ ప్రమాదాలు జరిగే అవకాశముంది.
ఇంటి బయటే కాదు ఇంట్లోనూ వర్షాకాలంలో ప్రమాదం పొంచి ఉంది. తడి చేతులతో ఎలక్ట్రికల్ ఉపకరణాలు, స్విచ్‌లను తాకవద్దు. విద్యుత్ పరికరాలను పిల్లలను వీలైనంత దూరంగా ఉంచండి. స్నానాల గదుల్లో గీజర్లు ఆఫ్ చేసిన తర్వాత నీటిని తాకాలి. చాలామంది గీజర్లు పనిచేస్తుండగానే చేతులు పెడుతుంటారు. తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలు వెళుతుంటే పిల్లలను భవనంపైకి వెళ్లకపోవడం మేలు.
వర్షాకాలంలో ఏదైనా వేడుకలకు పిల్లలను తీసుకెళ్తే అనుక్షణం వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే.. పండగలు, వేడుకల సమయంలో విద్యుత్తు అలంకరణ చేస్తుంటారు. పాత, అతుకుల తీగలు ఉపయోగించడంతో ఇన్సులేషన్ సరిగ్గా లేక విద్యుదాఘాతాలు జరిగే అవకాశముంటుంది. ఇలా వర్షాకాలంలో ప్రతిక్షణం పిల్లలను కనిపెట్టుకుని ఉండాలి. లేకపోతే ఏ క్షణంలో ఎటునుంచైనా ప్రమాదం రావొచ్చు. అందుకే పిల్లలను వానాకాలంలో ఇంటికే పరిమితం చేయండి. ఒకవేళ పాఠశాలకు పంపిస్తే అన్ని జాగ్రత్తలు చెప్పి మీరే వెళ్లి దిగబెట్టండి.. మీరే మళ్లీ ఇంటికి తీసుకెళ్లండి.