బీహార్ సారణ్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 40 కి చేరింది. బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉంది. అయితే కల్తీ మద్యం మాత్రం మహా రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య రాష్ట్రంలో నానాటికి పెరుగుతుంది.
కల్తీ మద్యం విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. కల్తీ మద్యం సేవిస్తే ప్రాణాలు కోల్పోతారని అన్నారు సీఎం నితీష్ కుమార్. మధ్య నిషేధం అమలులో లేని రోజుల్లో కూడా ఇక్కడ కల్తీ మద్యం తాగి జనం చనిపోయినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.
తమకు పరిహారం చెల్లించాలని మృతుల బంధువులు ధర్నాకు దిగగా.. వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని నితీష్ స్పష్టం చేశారు. ” రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉంది. గతంలో చాలామంది కల్తీ మద్యం తాగి చనిపోయారు. మద్యం తాగిన వారు కచ్చితంగా చనిపోతారు. ఇందుకు మన కళ్ళ ముందు ఉన్న సంఘటనే సాక్ష్యం ” అన్నారు.