దేశంలో మాదకద్రవ్యాల సరఫరా అరికట్టేందుకు ఇటు ప్రభుత్వాలు..అటు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్‌ని సీజ్ చేస్తూ సరఫరాదారులను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ను గోవాలో నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా సహా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు పక్కా నిఘా పెట్టారు.
అందులో భాగంగా మూడు నెలల క్రితం నారాయణ బొర్కర్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎడ్విన్‌పై మూడు నెలలుగా గోవాలో పోలీసులు నిఘా పెట్టారు. ఎడ్విన్ అక్కడకు వస్తున్నాడన్న సమాచారంతో 15 రోజులుగా గోవాలో కాపుకాసిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ రాత్రికి అతడిని హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.