నేడు అనేక ఉద్రిక్తతల నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం చేరుకున్నారు. ఇప్పటంలో కూల్చివేసిన ఇల్లరు పరిశీలించే బాధితులను పరామర్శించారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడంతో పవన్ కొద్ది దూరం నడిచి వెళ్లారు. అనంతరం వాహనంలో ఇప్పటం చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
‘‘మా సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్ర చేస్తున్నారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆర్కే ఇంటి దగ్గర రహదారి విస్తరణ లేదా? వైసీపీ వాళ్లకు ఇదే చెబుతున్నా.. ఇడుపలపాయలో హైవే వేస్తాం. గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరు.. విస్తరణ కావాలా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా.. మేమేమన్నా గూండాలమా? మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు? కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు’’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. పవన్ కళ్యాణ్ పిచ్చికూతలు కూస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని.. కేవలం ప్రహరీ గోడలు మాత్రమే పడగొట్టారని స్పష్టం చేశారు. అభివృద్ధితో ఊరు బాగుపడుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. శాంతిభద్రతలకు విగాథం కలిగించేలా పవన్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.