తప్ప తాగి ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చింది. ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు గత ఐదేళ్లుగా ఇదే వరుస. మందు తాగి స్కూల్‌కి వచ్చి పాఠాలు చెబుతోంది. మద్యం మత్తులో విద్యార్థులను తిట్టడం, కొట్టడం, సహోపాధ్యాయులతో గొడవలు పెట్టుకోవడం చేస్తోంది. విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆమెకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా మారలేదు. చివరకు ఏం చేశారంటే..?
తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మ మద్యం సేవించి పాఠాలు బోధిస్తుండేవారు. విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మకు ఎన్నిసార్లు తప్పును సరిదిద్దుకోవాలని హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయినికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
విషయం తెలుసుకున్న తాలూకా విద్యాధికారి(బీఇవో) హనుమానాయక్ పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయిని టేబుల్‌డ్రాను పరిశీలించడానికి ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు. గ్రామస్థులు టేబుల్ డ్రాకు తాళాలు విరగగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు లభించాయి. ఈ పరిణామంతో గంగలక్ష్మమ్మ తీవ్ర ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తాళాలు వేసుకుని ఆత్మహత్య చేసుకొంటానని హంగామా సృష్టించారు. అనంతరం పోలీసులు అక్కడికి వచ్చి మద్యం సీసాలను జప్తు చేశారు. ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.