సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ

-

శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మరింత లోతైన విచారణ కోసం రౌత్​ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.

ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకుంది. పాత్రచాల్ ​భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ అధికారుల సోదాలపై సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

“ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్‌ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా” అని ట్వీట్‌ చేశారు.

రౌత్‌ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఏ తప్పూ చేయకపోతే.. ఈడీ విచారణకు రౌత్‌ ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రామ్‌ కడం ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించడానికి సమయం ఉన్నప్పుడు ఈడీ ముందుకు వెళ్లడానికి ఎందుకు లేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news