ఈడీ చేతిలో క్యాసినో దందా గుట్టు.. ప్రముఖుల బంధాలు.. హవాలా కోణాలపై ఆరా

-

క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ బృందాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10 గంటల 45నిమిషాలకు ప్రవీణ్‌, మాధవరెడ్డి, సంపత్‌… హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పదకొండు గంటల నుంచి వీరిని అధికారులు ప్రశ్నించారు. వీరందరినీ కలిపి, విడివిడిగా దర్యాప్తు బృందం పలు అంశాలపై ఆరా తీసింది. ప్రధానంగా క్యాసినో దందాలో విదేశీ లావాదేవీలు, హవాలాకు సంబంధించి తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బట్టి ప్రవీణ్‌ బృందాన్ని ఈడీ అధికారులు విచారించినట్టు సమాచారం.

క్యాసినోలు నిర్వహిస్తూ ప్రముఖులను చార్టర్‌ విమానాల్లో నేపాల్‌, బ్యాంకాక్‌ తరలించడం, పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం దారి మళ్లింపు, బంగారం అక్రమంగా దేశంలోకి తీసుకురావడం, హవాలా కార్యకలాపాలు తదితర అంశాలపై ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్‌ బృందాన్ని లోతుగా ప్రశ్నించింది.

హవాలా ద్వారా నగదు బదిలీ వ్యవహారంలో ఈడీ అధికారుల ప్రశ్నలకు ప్రవీణ్‌, మాధవరెడ్డి తడబడినట్టు తెలుస్తోంది. క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారకద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం తీసుకువెళ్లడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్‌, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చేవారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్దం. దీనిపైనే ప్రస్తుతం ఈడీవిచారిస్తోంది.

కొన్ని సంవత్సరాలుగా ప్రవీణ్‌ బృందం ద్వారా విదేశాల్లో క్యాసినోలకు వెళ్లిన ప్రముఖుల సమాచారం విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. హవాలా మార్గంలో ద్రవ్యమారకం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. విదేశీ మారకద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్టు బయటపడితే.. రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనమయ్యే అవకాశం ఉంది.

విచారణలో పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాలను గుర్తించినట్టు తెలుస్తోంది. ఇందులో విదేశీ బ్యాంకులకు చెందిన ఖాతాలు సైతం ఉన్నాయని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు వెల్లడైందని సమాచారం. క్యాసినోల తరఫున ప్రచారం నిర్వహించిన సినీతారలకు వీటి ద్వారానే నగదు బదిలీ జరిగిందని గుర్తించారు. బృందాన్నిఈడీ మరోసారి విచారించనున్నట్టు తెలుస్తోంది. మరికొంత మందికి కూడా నోటీసులు జారీ చేసి… విచారణకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news