TSPSC పేపర్ లీక్.. ముగిసిన ప్రధాన నిందితుల ఈడీ విచారణ

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో ఓవైపు సిట్.. మరోవైపు ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుల ఈడీ విచారణ ముగిసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను రెండు రోజులపాటు విచారించేందుకు ఈడీ న్యాయస్థానం ద్వారా అనుమతి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో ఇద్దర్నీ ఈడీ అధికారులు విచారించారు.

మంగళవారం రోజున ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఉదయం 11.30 గంటలకు చంచల్‌గూడ జైలుకు చేరుకుంది. ప్రధానంగా ప్రశ్నపత్రాలు విక్రయించడం ద్వారా ఎంత డబ్బు సంపాదించారు? ఆ సొమ్ము ఏ మార్గంలో స్వీకరించారు? ఏఏ అవసరాలకు వినియోగించారు? అన్న అంశాలపైనే ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించినట్టు సమాచారం. వారి బ్యాంకు ఖాతా వివరాలు చూపుతూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.

ఈడీ బృందం అడిగిన చాలా ప్రశ్నలను ప్రవీణ్‌ సమాధానం దాటవేసినట్లు, ఎక్కువసేపు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. రాజశేఖర్‌ మాత్రం తానేమీ డబ్బు సంపాదించలేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న అధికారులు సాయంత్రం 5.30 గంటల సమయంలో తిరిగి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news