మాజీ మంత్రి, వివాదాస్పద నాయకులు అవంతి శ్రీను మరో వివాదంలో ఇరుక్కున్నారు. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా అనూహ్య పరిణామం ఒకటి ఆయనకు ఎదురైంది. చేదు అనుభవం ఎదురైంది. విశాఖ తీరాన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో తాగునీరు సవ్యంగా లేక నానా అవస్థలూ పడుతున్నారు. ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ వస్తుందని మహిళలు నిన్నటి వేళ ఆయన్ను నిలదీశారు. అయితే ఈ సమస్యను సావధానంగా విన్నారు. వెంటనే చెడుగా రియాక్ట్ కాకుండా ఎగ్రసివ్ గా పోకుండా సావధానంగానే విన్నారు. అక్కడున్న అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు.
వాస్తవానికి ఫ్లోరైడ్ వాటర్ ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఉందని తెలుస్తోంది. రక్షిత మంచినీటి ట్యాంకుల నుంచే ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న వాటర్ వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తే , అది కూడా శుద్ధ జలం అందితే తమకు మేలు అని మహిళలు చెబుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే వివాదం తీరు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రజలు ఏం చెప్పినా సావధానంగానే విన్నారాయన. ఇంత వరకూ ఈ సమస్య తమ దృష్టికి ఎవ్వరూ తీసుకురాలేదని మహిళలు తమగోడు చెప్పుకున్నారు. అదే తమ దురదృష్టం అని కూడా వ్యాఖ్యానించారు.వాస్తవానికి భీమిలి నియోజకవర్గం అంటే పర్యాటకానికి మారు పేరు. ఇక్కడి సముద్ర తీరం ప్రకృతి అందాలకు నెలవు. కానీ భూగర్భ జలాలు కలుషితం అయ్యయో లేదా మరో కారణమో కానీ ఎన్నడూ లేనివిధంగా ఫ్లోరైడ్ వాటర్ వస్తుందని ప్రాథమిక సమాచారం అందుతోంది. దీంతో తాగేందుకు గుక్కెడు నీళ్లు వీళ్లకు లేవు. అయితే ఇది ఫ్లోరైడ్ వాటరా లేకా మరో కలుషిత రసాయనాల చేరిక వల్ల నీరు ఈ విధంగా రూపొందిందా అన్నది కూడా ప్రయోగ పరీక్షలు జరిపి నిర్థారించాలి. ఈ నేపథ్యంలో వారానికి రెండు, మూడు సార్లు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని ఇక్కడి మహిళలు కోరుతున్నారు. ఫ్లోరైడ్ వాటర్ అన్న అనుమానమే నిజం అయితే ప్రభుత్వం ఇంకాస్త వేగంతో స్పందించి సమస్యకో శాశ్వత పరిష్కారం ఇవ్వాల్సి ఉంది.