ఎడిట్ నోట్: బాబు-జగన్ దూకుడు..పవన్‌ స్లో.!

-

ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలే లక్ష్యంగా నడుస్తున్నాయి..ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే సమయం ఉన్నా సరే..ప్రధాన పార్టీలు ఎన్నికలు టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇటు జగన్ సైతం మరొక్కసారి సత్తా చాటితే..మరో 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉండొచ్చని చూస్తున్నారు. పైగా 175కి 175 టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇలా టీడీపీ-వైసీపీలు ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి.

అధికారంలో ఉన్న జగన్..ఓ వైపు పథకాల ప్రారంభమని, అభివృద్ధి పనుల శంఖుస్థాపన అని భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. అలాగే ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఇటు తమ ఎమ్మెల్యేలని గడపగడపకు పంపిస్తున్నారు. అలాగే పీకే టీం ఆల్రెడీ వైసీపీ గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇక ఎన్నికలే లక్ష్యంగా జగన్ పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు..తన ఎన్నికల టీంని మారుస్తున్నారు.

రీజనల్ కొ ఆర్డినేటర్లతో పాటు పలు జిల్లాల అధ్యక్షులని మార్చారు. ఇక జిల్లాల వారీగా పార్టీ మరింత బలపడేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవగ్రనికి చెందిన ఎమ్మెల్యేతో మాట్లాడుతూ..పార్టీ బలోపేతానికి సూచనలు చేస్తున్నారు. అటు ఓవరాల్ గా వర్క్ షాపులు పెట్టి, ఎమ్మెల్యేల అందరికీ క్లాస్ ఇస్తున్నారు.

జగన్‌కు ధీటుగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ సమావేశం పెట్టి నియోజకవర్గాల్లోని పరిస్తితుల్ని తెలుసుకుని, ఇంకా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు పెడుతూ..నేతలకు ఎప్పటికప్పుడు క్లాస్‌లు పీకుతున్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీ బలంగా ఉండటమే లక్ష్యంగా నేతలకు సూచనలు చేస్తున్నారు.

ఇక నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు బాదుడేబాదుడు కార్యక్రమం, పార్టీ సభ్యత్వాలు, బూత్ లెవెల్‌లో ఇంచార్జ్‌లని నియమించడం చేస్తున్నారు. ఇటు బాబు సైతం రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు..అలాగే వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. అటు లోకేష్ సైతం వైసీపీ పై పోరాడుతూ, మరో వైపు తన పాదయాత్రకు రెడీ అవుతున్నారు. జనవరి నుంచి పాదయాత్ర మొదలుకానుంది. ఈ పాదయాత్ర ఏర్పాట్లని టీడీపీలోని యువ నేతలు చూసుకుంటున్నారు.

అలాగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో వైసీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష మంది ఓటర్లకు అవగాహనకు వచ్చేలా వివరించడానికి సిద్ధమవుతున్నారు. వ్యూహకర్త రాబిన్ శర్మ..క్షేత్ర స్థాయిలో టీడీపీ కార్యక్రమాలని పరిశీలిస్తున్నారు. ఇలా టీడీపీ కార్యక్రమాలు ఉన్నాయి.

అయితే ఇలా బాబు-జగన్ తమదైన శైలిలో ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ఈ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు..ఏదో అప్పుడప్పుడు జనంలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదు. అసలు పార్టీకి 175 స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు. పైగా పొత్తుల విషయం క్లారిటీ లేదు. మొత్తానికి బాబు-జగన్‌తో పోలిస్తే పవన్ వెనుకబడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news