విశిష్టం అయిన పండుగల నిర్వహణతో భారతీయత విలువ అన్నది మరో మారు విశ్వవ్యాప్తం అవుతుంది.ఈ సారి హోలీ పండుగ రాక అలాంటి విశిష్టతలనే మోసుకువచ్చింది.మనుషుల నైరాశ్యాన్ని కాస్త దూరం చేసి భరోసా ఇచ్చి వెళ్లింది.సామూహికంగా చేసుకునే పండుగలలో ఉన్నంత హాయి ఆనందం మరోచోట ఉండవని కూడా చాటి చెప్పి వెళ్లింది. కరోనా లాంటి మహమ్మారులు ఎన్ని ఉన్నా సామాజిక జీవనంలో ఎన్ని మార్పులు వచ్చినా వాటన్నింటినీ మరిచిపోయేందుకు నిన్నటి వేడుక ఓ అవకాశం అందరికీ ఇచ్చింది.
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ హోలీ అంటే ప్రత్యేకం అయిన ప్రేమ జనంలో ఉంది. పండుగ అంటే ప్రత్యేకించిన రీతికి సంకేతం అయి ఉంది.ఆ విధంగా చాలా పండుగల్లో భారతీయత,కలిసి ఉండే నైజం, కలుపుకుని పోయే తత్వం అన్నవి ఓ చాటింపు. ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వరకూ ఉన్న భిన్న సంస్కృతుల్లో కూడా హోలి పండుగ ఉంది. అన్నింటా రంగుల పండుగ విశిష్టార్థాన్నే చాటి వెళ్లింది. తీవ్రమయిన నిరాశలతో కాలం వెచ్చించిన రోజున సాధించాల్సినవి గుర్తుకు వస్తాయి.లక్ష్యాలు నిర్ణయం అయి ఉన్నాక ఏం చేయాలో అన్న ఒక స్థిరం అయిన ఆలోచన ఒకటి వెన్నంటి ఉంటుంది.
కరోనా తరువాత ప్రజల జీవన ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వాలు కూడా గడిచిన రెండేళ్లలో అస్సలు ఈ పండుగ జరుపుకోవద్దని, ఎక్కువ మంది ఓ చోట గుమిగూడితే కరోనా వ్యాప్తికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని పదే పదే చెబుతూ ప్రజలను కట్టడి చేస్తూ వచ్చింది. వాటి ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి.ఇవాళ్టికీ కరోనా ప్రమాదం ఫోర్త్ వేవ్ రూపంలో పొంచి ఉన్నా కూడా ఈ సారి జనం ధైర్యం చేసి పండుగ చేసుకున్నారు.
ఒక్కో రంగు ఒక్కో విశేషంతో ఉంటుంది. ఒక్కో రంగు ఒక్కో వినిమయ సంస్కృతికి ఆనవాలు అయి ఉంటుంది. రంగుల్లో జీవితాలు ఎలా ఉంటాయి. హోలీ వేళ భారతీయ తత్వం ఏం చెబుతుంది.ఇవన్నీ మరోసారి తలుచుకుని తీరాలి.ఇతరులను ఆదుకునే తత్వం, ఇతరులతో కలిసి పోయే నైజం రంగుల్లేని జీవితం.. రంగులు అంటని జీవితం అంటే నటన సంబంధం కాని జీవితం అందరికీ ఇవాళ ఎంతో అవసరం. నటన వద్దని జీవితంలో నిబద్ధత ఒక్కటే ఎంతో అవసరం అని చాటి చెప్పే పండుగలు మనల్ని మారుస్తున్నాయా?
జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు పండుగల విలువ గుర్తుకు వస్తుంది.ఆనందం విలువ గుర్తుకువస్తుంది.మనుషులు మన కోసం ఉన్నారో లేదో అన్నది కూడా గుర్తుకు వస్తుంది.ఆ విధంగా కొన్ని గుర్తుకు వచ్చేందుకు కొన్నింటిని నిలుపుకునేందుకు పండగ ఒక దారి ఇస్తుంది. ఒక జ్ఞాపకం అవుతుంది. ఒక స్థిరమయిన జ్ఞాపకం అవుతుంది అని రాయాలి.ఆ విధంగా రంగుల పండుగ హోలీ నిన్నటి వేళ రెండేళ్ల తరువాత దేశం యావత్తూ హాయిగా జరుపుకుంది.ఆనందడోలికల్లో మునిగి తేలింది.కరోనా మూడు దశలు అనంతరం వచ్చిన హోలీ కావడంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.