ఎడిట్ నోట్: జగన్ డ్యామేజ్ కంట్రోల్..!

-

జగన్ పదే పదే టీడీపీ అనుకూల మీడియాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దుష్టచతుష్టయం అంటూ కొన్ని మీడియా సంస్థలని టార్గెట్ చేస్తున్నారు. ఆ మీడియానే తమపై కుట్రలు చేస్తుందని, తాము ప్రజలకు మంచి చేస్తున్నా సరే వాటిపై అబద్దాలు చెబుతుందని మండిపడుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మంచి చేస్తుందో లేదో ప్రజలకు క్లారిటీ ఉంది. ఇక టీడీపీ అనుకూల మీడియాలో వచ్చేవన్నీ అవాస్తవాలే అన్నట్లు జగన్ ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ మీడియా సంస్థలని ప్రజలు నమ్మకుండా చేయాలనేది జగన్ టార్గెట్. కానీ అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

ఎందుకంటే ఎవరికి వారికి సొంత, అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక వైసీపీకి కూడా సొంత, అనుకూల మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి. కాబట్టి టీడీపీ అనుకూల మీడియానే టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. పైగా పదే పదే అలా టార్గెట్ చేయడం వల్లే..ఆ మీడియా సంస్థలు ఇంకా కసితో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని లోపాలని ఎత్తి చూపుతున్నాయి. అలాగే నేతల అక్రమాలు అంటూ పెద్ద ఎత్తున కథనాలు ఇస్తున్నాయి. మంత్రులని సైతం వదలడం లేదు. మంత్రుల అవినీతి, అక్రమాలు అని కథనాలు వేస్తున్నాయి. ఉత్తరాంధ్రని దోచుకున్నారని, రాయలసీమకు ద్రోహం చేశారని ఆధారాలతో సహ కథనాలు వేస్తున్నాయి.

ఈ కథనాలని ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది తర్వాత విషయం. కానీ ఈ అంశాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు జగన్ డ్యామేజ్ కంట్రో చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకున్న జగన్..చివరిలో మంత్రులకు చిన్నగా వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిసింది.

మరో 16 నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయని, ఈ సమయంలో మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, మంత్రులే లక్ష్యంగా అవినీతి ఆరోపణలతో కథనాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు మంత్రులపై అవినీతి ఆరోపణలతో కూడిన కథనాలు వస్తే, వాటి ప్రభావం ప్రజలపై తీవ్రస్థాయిలో ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. మన ప్రభ్వుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తోందని, ఈ తరుణంలో మీడియా ఫోకస్‌ మంత్రులపై ఉంటూ అవినీతి కథకాలు వస్తే, మనం పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని మంత్రులకు జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విధంగా జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇది ఇంతటితో ఆగుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news