ఎడిట్ నోట్: కేసీఆర్ వర్సెస్ డీకే.!

-

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి..ఇంతకాలం తెలంగాణ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ వ్యూహాలని మించి వ్యూహాలు వేసే నాయకుడు ప్రత్యర్ధి పార్టీల్లో కనిపించలేదు. ఇప్పుడు ఆ పరిస్తితి మారుతుంది. కే‌సి‌ఆర్‌కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఓ వ్యూహకర్తని తీసుకురానుంది. కే‌సి‌ఆర్‌కు ధీటుగా వ్యూహాలు రచించి..కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సరికొత్త ఇంచార్జ్‌ని పట్టుకురానుంది.

మామూలుగా కాంగ్రెస్ జాతీయ పార్టీ..దీంతో తెలంగాణకు ఓ అధ్యక్షుడు ఉంటారు..అలాగే అక్కడ వ్యవహారాలని చూసుకోవడానికి ఓ ఇంచార్జ్ ఉంటారు. టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జ్ గా మాణిక్ రావు ఠాక్రేని పెట్టారు. ఈ ఇద్దరి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పనిచేస్తుంది. అయితే వీరిద్దరు కే‌సి‌ఆర్ వ్యూహాలకు చెక్ పెట్టే స్థాయికి రావడం లేదు. కే‌సి‌ఆర్ వ్యూహాలు వేరుగా ఉంటున్నాయి. కాంగ్రెస్ మాదిరిగా బి‌జే‌పికి అధ్యక్షుడుగా బండి సంజయ్, ఇంచార్జ్ గా తరుణ్ చుగ్ ఉన్నారు..అదనపు ఇంచార్జ్‌లని పెట్టుకున్నారు. కానీ ఎవరు కూడా కే‌సి‌ఆర్‌తో సరితూగడం లేదు. వారి స్థాయిలో వారు పనిచేస్తున్నారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ..కే‌సి‌ఆర్‌ని ఢీకొట్టేలా బలమైన వ్యూహకర్తని బరిలో దించుతుంది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కీలక పాత్ర పోషించిన అక్కడ పి‌సి‌సి అధ్యక్షుడు డి‌కే శివకుమార్‌ని..తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా నియమించేందుకు చూస్తున్నట్లు తెలిసింది. కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంలో డి‌కే పాత్ర చాలా కీలకం.

ఇక కర్నాటక, తెలంగాణ పక్క పక్కనే ఉంటాయి. ఇంచుమించు రెండు రాష్ట్రాల్లో పరిస్తితులు, రాజకీయం ఒకేలా ఉంటుంది. అందుకే డి‌కేని తెలంగాణ ఇంచార్జ్ గా పెడితే..కే‌సి‌ఆర్‌కు చెక్ పెట్టవచ్చు అనేది కాంగ్రెస్ ప్లాన్ అని తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి బెంగళూరుకు వెళ్ళి డి‌కే శివకుమార్‌ని కలుస్తున్నారు. అలాగే కాంగ్రెస్ లో చేరబోయే పొంగులేటి, జూపల్లి సైతం డి‌కేని కలిశారు. అంటే త్వరలోనే డి‌కే..తెలంగాణకు ఇంచార్జ్ గా వస్తారని తెలుస్తుంది. సామాజికంగా, ఆర్ధికంగా బలమైన నేతగా ఉన్న డి‌కే..వ్యూహాలు వేయడంలో ధిట్ట..అలాగే కాంగ్రెస్ నేతలని ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేయించగలరు. బలమైన అభ్యర్ధులని డిసైడ్ చేయగలరు..ఆర్ధికంగా అండదండలు అందించగలరు. కాబట్టి డి‌కే వస్తే..కే‌సి‌ఆర్‌కు ధీటుగా ఉంటారని ప్లాన్ చేస్తున్నారు. మరి డి‌కే ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news