ఎడిట్ నోట్:  కేసీఆర్ ‘జాతీయ’ లెక్కలు..!

-

మొత్తానికి దేశ రాజకీయాల్లో మార్పు కావాలని, బీజేపీ ముక్త్ భారత్ చేయాలని, మోదీ సర్కార్‌ని గద్దె దించాలని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్…జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అతి త్వరలోనే జాతీయ పార్టీ పెట్టబోతున్నానని చెబుతున్నారు. ఇటీవల నిజామాబాద్ సభలో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నాని, ప్రజలు ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు. ఇక రాష్ట్రంలోని టీఆర్ఎస్ నేతలంతా ముక్త కంఠంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, ఆయనని దేశ ప్రజలు పిలుస్తున్నారని మాట్లాడుతున్నారు.

మరి ప్రజలు పిలుస్తున్నారో లేక…బీజేపీకి రాజకీయం చెక్ పెట్టడానికి కేసీఆర్ కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారో తెలియడం లేదు గాని..మొత్తానికి జాతీయ పార్టీ పెట్టడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇక జాతీయ పార్టీపై తాజాగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చలు జరిపారు. హైదరాబాద్‌కు వచ్చిన కుమారస్వామితో కేసీఆర్..జాతీయ పార్టీకి సంబంధించిన అంశాలని చెప్పుకొచ్చారు. అలాగే జాతీయ పార్టీ పెట్టడానికి గల కారణాలు…పెడితే ఎలా ఉంటుందనే లెక్కలు బాగానే చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమానికి ముందు చేపట్టినట్లుగానే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి.. అభిప్రాయ సేకరణ జరిపినట్లు కేసీఆర్ తెలిపారు. అలాగే ప్రత్యామ్నాయ జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం సాధించామని, త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి విధివిధానాల రూపకల్పన జరుగుతోందని కుమారస్వామికి వివరించారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ దేశంలోని అన్ని వర్గాల నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని కేసీఆర్ అంటున్నారు.

కాకపోతే పార్టీ ఎప్పుడు ఉంటుందనేది చెప్పడం లేదు గాని..త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అలాగే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జాతీయ పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్న. ప్రతి రాష్ట్రంలోనూ బలమైన పార్టీలు ఉన్నాయి. అలాంటప్పుడు కేసీఆర్..జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎలా మారుతారు. అసలు ఆయన టార్గెట్ ఏంటి అనేది క్లారిటీ లేదు.

ఇప్పుడున్న పరిస్తితుల్లో కేసీఆర్ టార్గెట్…బీజేపీ మాత్రమే. ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని చూస్తున్నారు. అందుకు విపక్ష పార్టీలని ఏకం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రాంతీయ పార్టీకి చెందిన అధినేత. దీని వల్ల దేశంలో కీలక పాత్ర పోషించడం కష్టమని అనుకుని ఉంటారు…అందుకే జాతీయ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ జాతీయ పార్టీ పెట్టి కొంత ప్రభావం చూపితే పర్లేదు..లేదంటే మొదటికే మోసం వచ్చి..రాష్ట్రంలో కూడా దెబ్బతినాల్సి వస్తుంది. ఈ లెక్కలు ఏమి తెలియకుండా కేసీఆర్ నేషనల్ పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారని అనుకోవడానికి లేదు. మరి చూడాలి జాతీయ స్థాయిలో కేసీఆర్ చేసే రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news