ఇప్పుడు ఏపీ రాజకీయాలు విశాఖ సెంటర్‌గానే నడుస్తున్నాయి.. ఎప్పుడైతే అమరావతి రైతులు.. రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్‌తో అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో.. అప్పటినుంచి వైసీపీ నేతలు విశాఖ వేదికగా మూడు రాజధానుల ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి అమరావతి కోసం దాదాపు మూడేళ్ళ నుంచి ఆ ప్రాంత రైతులు, ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారో.. అప్పటినుంచి ఉద్యమబాట పట్టారు.
అలాగే అమరావతి టూ తిరుపతి పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వం కోర్టులో నిలబడదని చెప్పి.. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంది. అయితే మళ్ళీ తప్పులు లేకుండా కొత్త బిల్లుతో వస్తామని చెప్పింది. ఇక ఏ సమయంలోనైనా జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టవచ్చని వైసీపీ మంత్రులు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో అమరావతి రైతులు కోర్టు పర్మిషన్‌తో పాదయాత్ర మొదలుపెట్టారు.
ఇక వారికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అమరావతి రైతులు..వారి దారిలో వారు పాదయాత్ర చేసుకుంటూ వెళుతున్నారు..కానీ వారిని విశాఖలో అడ్డుకుంటామని, దాడులు జరిగితే తమది బాధ్యత కాదని, ఉత్తరాంధ్ర ద్రోహులు అని, పెయిడ్ ఆర్టిస్టులని, చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అదే సమయంలో విశాఖని పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో పోరాటం మొదలుపెట్టారు. అధికారంలో ఉండి కూడా ఉద్యమం అని వైసీపీ నేతలు సరికొత్త పంథాలో ముందుకెళుతున్నారు. ఇప్పటికే జేఏసి కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా పోరాటం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ నెల 15న వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన ర్యాలీ జరగనుంది. అయితే ఇక్కడ వైసీపీ పక్కగా విశాఖ రాజధాని అంటూ పోరాటం చేస్తూనే..ఉత్తరాంధ్రలో అమరావతి పాదయాత్రకు బ్రేక్ వేయాలని, అలాగే రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టాలనే కాన్సెప్ట్‌తో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.
ఇక వైసీపీకి ధీటుగా టీడీపీ కౌంటర్లు ఇస్తుంది..ఉత్తరాంధ్రలో అమరావతి పాదయాత్ర విజయవంతమయ్యేలా చూసుకుంటామని, ఎవరు అడ్డు వస్తారో చూస్తామని మాట్లాడుతున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు సైతం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అలాగే గతంలో అమరావతికి మద్ధతుగా ధర్మాన, బొత్స లాంటి వారు మాట్లాడిన వీడియోలని చూపిస్తున్నారు. ఇది పూర్తిగా వైసీపీ చేస్తున్న రాజకీయం అని, అలాగే మూడు రాజధానుల ద్వారా ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారు…దమ్ముంటే మూడు రాజధానులకు మద్ధతుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ సైతం..వైసీపీపై విరుచుకుపడటం మొదలుపెట్టారు..దేనికి గర్జనలు అంటూ వరుసపెట్టి వైసీపీ వైఫల్యాలని ట్విట్టర్‌లో పోస్టు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు అసెంబ్లీలో అమరావతికి మద్ధతు ఇచ్చి..ఇప్పుడు మూడు రాజధానుల పేరిట రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాగే విశాఖలో వైసీపీ గర్జన రోజే అంటే 15వ తేదీన పవన్ విశాఖకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో జనవాణి నిర్వహించనున్నారు. ఇటు అమరావతికి మద్ధతుగా టీడీపీ యాక్షన్ ప్లాన్‌లో దిగుతుంది. మొత్తానికి విశాఖ చుట్టూ రాజకీయం ఆసక్తికరంగా సాగుతుంది.