పదవులు ఏమయినా కొత్త జీవితాలను ఇస్తాయి. పదవులు ఏమయినా నిన్నటి జీవితాన్ని మలుపు తిప్పుతాయి. కష్టం ఫలిస్తే వచ్చే పదవి కొంత కాలం జనం హృదయంలో నిలిచిపోయే విధంగా పనులు చేయిస్తుంది. ప్రజా జీవితాల్లో పదవులు మంచికి తావిస్తాయి అని అనుకోవడం ఓ భ్రమ కావొచ్చు లేదా వాస్తవ దూరం కావొచ్చు. ఎందుకంటే పదవులను పొందాక మన నాయకుల తీరు మారిపోతుంది. పదవులు పొందాక గర్వం నెత్తికెక్కి ప్రవర్తనలో విపరీతం అయిన మార్పు వస్తుంది. ఇంకా చాలా జరుగుతాయి కూడా! అయినా పదవి కారణంగా కొంతలో కొంత అయినా ప్రజలకు మేలు జరిగి మంచి మార్పు సిద్ధి స్తుందని అనుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో అత్యాశ కావొచ్చు కానీ ఆశించడం మాత్రం తప్పు కాదు. ఎందుకంటే కొన్ని పరిణామాల కారణంగా అయినా నాయకులు మారి తమ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు అని అనుకోవడం అత్యాశ కానే కాదు .
నిన్నటి వేళ కొత్తగా పదవులు అందుకున్న వారంతా జగన్ కాళ్ల మీద పడ్డారు. అదంతా గౌరవంలో భాగం అని అనుకుందాం కాసేపు. కానీ వీళ్లంతా సమర్థులు అని పదవులు ఇచ్చారా లేదా సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా పదవులు ఇచ్చారా?
ఇప్పుడు పదవులు పొందిన వారంతా ఓటు బ్యాంకు రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేయనున్నారో అన్నది కూడా ఆసక్తిదాయకం. ఎందుకంటే మంత్రులే అయినా చిత్తు చిత్తుగా ఓడిపోయినా ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఎప్పటి నుంచో పదవి కోసం అర్రులు చాస్తున్న రోజా ఇకపై మారి నగరి నియోజకవర్గాన్ని మంచి మార్గంలో నడిపిస్తారా? ఎందుకంటే ఆమె ఇప్పటివరకూ నగరి నియోజకవర్గంను బాగు చేసింది ఏమీ లేదు అన్నది ఓ ఆరోపణ. అదేవిధంగా చాలా ఏళ్లకు ఎమ్మెల్యే అయి తరువాత మంత్రి పదవి కొట్టేసిన వీర విధేయుడు అంబటి రాంబాబు కూడా పల్నాటి సీమకు ప్రగతి ప్రసాదిస్తారా అన్నది ఇప్పుడు సందేహాస్పదంగానే ఉంది. వీళ్లంతా బాగా పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు సునాయాసం కావడం తథ్యం.