ఒకప్పుడు ఢిల్లీ వేరు..ఇప్పుడు ఢిల్లీ వేరు
పూర్తిగా మారిపోయింది.. కొన్నంటే కొన్ని
పరిణామాల కారణంగా రాష్ట్రానికి రావాల్సినవన్నీ
రావడం లేదు.. దక్కాల్సినవి దక్కడం లేదు
వీటి కోసమే మాట్లాడే గొంతుకలు కావాలి
వాటిని ప్రాతినిధ్య స్వరాలు అని అనాలి
అలాంటి రిప్రజెంటేటివ్ వాయిస్ కోసం కొంత పరిశీలన
జరిగాక పెద్దల సభకు వెళ్లే అభ్యర్థుల తోవ సుగమం కానుంది
పెద్దల సభకు ఎన్నికల నేపథ్యంలో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఇవే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. జూన్ లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలయింది. దీంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. వాస్తవానికి తెలంగాణ నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి తెలంగాణ కు కొన్ని రికమెండేషన్లు వెళ్లాయి. కానీ అవేవీ ఆమోదితం కాలేదు. ఆఖరుగా ఎవరు ఈ బరిలో నిలుస్తున్నారు అన్నదే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ కేంద్రంగా ఎవరు పోరాడుతారు అన్నదే ఇప్పుడిక చర్చకు తూగే విషయం.
ఎంతో కొంత చర్చల ద్వారా , సంప్రతింపుల ద్వారా ఢిల్లీ పెద్దలను కలిసి మాట్లాడి వస్తున్నారు. ఈ దశలో రాజ్యసభలో రాష్ట్రం తరఫున మాట్లాడే గొంతుకల అన్వేషణకు మంచి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు.టీడీపీకి ముగ్గురంటే ముగ్గురే ఎంపీలు లోక్ సభలో మిగిలారు. అయినప్పటికీ వారిలో ఎంపీ రామూ ఒక్కరే మాట్లాడుతున్నారు. ఆయన మాత్రమే రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఎంపీ రామూ కొన్ని విషయాలు మంచి ఫలితాలు అందుకుంటున్నారు. ఆయనకు దీటుగా ఇదే శ్రీకాకుళం నుంచి ఓ బీసీ మహిళకు ఇవ్వాలన్నది జగన్ ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా కిల్లి కృపారాణికి ఈ సారి అవకాశం దక్కనుంది అని తెలుస్తోంది. దాదాపు ఈ విషయమై నేడో రేపో ఓ నిర్ణయం వెలువరించేందుకు అవకాశాలు ఉన్నాయి.
ఇక అదానీ గ్రూపు నుంచి ఓ స్పష్టత వచ్చినందున పారిశ్రామిక వేత్తల కోటా నుంచి ఆయన వెళ్లరని, ఆయన కుటుంబ నుంచి కూడా ఎవ్వరికీ ఎటువంటి రాజకీయ ఆసక్తులూ లేవని తేలిపోయింది. ఆయన అసలు తన ప్రతిపాదనలే పంపకుండా ఓ వర్గం మీడియా వార్తలు వండి వార్చింది. ఇవన్నీ జగన్ ను సైతం ఆశ్చర్యపరిచాయి. కొంత కలవరపాటుకు గురిచేశాయి. ఈ తరుణంలో మరొకరి పేరు తెరపైకి వచ్చింది. నాడు వైఎస్సార్ హయాంలో తమకు చేరువుగా ఉన్న జూపుడి ప్రభాకర్ పేరు అనూహ్యంగా వచ్చింది. పారిశ్రామిక వేత్తల కన్నా ఓ దళిత నేతకు తమ ప్రాధాన్యం ప్రాముఖ్యం ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఇది కూడా ఇంకా కన్ఫం కాలేదు.
ఇక పార్టీ వాయిస్ వినిపించడంలో గతంలో జూపుడి చాలా అంటే చాలా కృషి చేశారు. ఓ దశలో పార్టీ విధివిధానాలను మీడియాకు వివరించడంలో, లైవ్ డిబెట్లలో ఆయన పాల్గొని వైసీపీ మైలేజీ పెంచిన వారిలో ఒకరు ఆయన. ఆయనకు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక సమయంలో తమ పాత స్నేహాల పునరుద్ధరణలో భాగంగా పార్టీ తరఫున మళ్లీ మళ్లీ గొంతుక వినిపించే విధంగా తగిన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇక దేశ రాజకీయాల్లో ఇప్పటికే ఓ సారి కేంద్రమంత్రిగా కృపారాణి పనిచేశారు కనుక ఆమె కూడా బలీయంగా పార్టీ వాయిస్ వినిపించేందుకు, మీడియా కెమెరాలను ఫేస్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వీరే కాకుండా సాయిరెడ్డి ఎలానూ ఉండనున్నారు. మరో సభ్యుడు మర్రి రాజశేఖర్ అయితే కమ్మ సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇచ్చిన విధంగా ఉంటుందని యోచిస్తున్నారు.
వాస్తవానికి ఎప్పటి నుంచో రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న ప్రభుత్వంలో కమ్మ సామాజికవర్గంకు అస్సలు ప్రాధాన్యం లేదని పలు సార్లు పలు వార్తలు వెలుగు చూశాయి. కొడాలి నాని కూడా ఇప్పుడు అప్రాధాన్యం అయిపోయారని కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ఆయన ఖండించినా, తోసిపుచ్చినా కమ్మ సామాజికవర్గం అన్నది కొంత అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవం. ఆ అసంతృప్తికి విరుగుడు అన్న విధంగా, విధేయతకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ఆయన్ను ఎంపిక చేసేందుకు జగన్ సుముఖంగా ఉన్నారన్నది ఓ ప్రాథమిక సమాచారం. వీటిపై ఒకటి రెండు రోజుల్లో ఓ క్లారిఫికేషన్ రానుంది.
– రత్నకిశోర్ శంభుమహంతి