బడుగు వర్గాలకు అధికారం రాకుండా అడ్డుకున్న చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. దళిత, గిరిజన, మైనార్టీ బిడ్డలను దేశ రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు. బీసీలు అంటే కేసీఆర్ కు చిన్నచూపు, చులకన భావం అని దుయ్యబట్టారు. అందరినీ మోసం చేసి కేసీఆర్ కుటుంబం తెలంగాణను పాలిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో బీసీ వివక్ష చూసి చాలా సార్లు కంటతడి పెట్టుకున్నానని తెలిపారు.
మరోవైపు దళిత జాతిని మోసం చేసిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ సమాజాన్ని మోసం చేశాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదని, బీజేపీ బీసీలకు రాజ్యాధికారం ఇస్తోందని అన్నారు. ఓట్ల కోసమే బీసీ సమాజం కాదు.. రాజ్యాధికారం కోసం బీసీ సమాజం ఉండాలని ఈటల అన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరని చూడకుండా ప్రజలు బీజేపీకి ఓట్లేయ్యాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే బీజేపీకి మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని అన్నారు.