బిహార్‌లో ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకుతూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగారు జేడీ(యు) నేత నీతీశ్ కుమార్. ఆర్జేడీతో మరోసారి చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బిహార్‌లో ఎన్డీయే కూటమి నుంచి జేడీ(యు) వైదొలగడం.. రాజ్యసభలో భాజపా సంఖ్యాబలంపై కొంతమేర ప్రభావం చూపిస్తోంది.
రాజ్యసభలో జేడీ(యు)కు ఐదుగురు ఎంపీలు ఉన్నారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ కూడా ఈ పార్టీ నేతే. అయితే జేడీ(యు) భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా రాజ్యసభలో ఎన్డీయేకు మోజార్టీ లేదు. కాకపోతే గత మూడేళ్లలో ఈ కూటమి నుంచి విడిపోయిన మూడో పార్టీ జేడీ(యు). అంతకుముందు శివసేన, శిరోమణి అకాలీదళ్.. ఎన్డీయే నుంచి తప్పుకొన్నాయి. ఇప్పుడు నీతీశ్ వైదొలగడంతో రాజ్యసభలో ఈ కూటమి బలం ఇంకాస్త తగ్గినట్లయింది.
రాజ్యసభలో మొత్తం సంఖ్యాబలం 245 కాగా.. జమ్మూకశ్మీర్ నుంచి నాలుగు, త్రిపుర నుంచి ఒకటి, మూడు నామినేటెడ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237గా ఉంది. మెజార్టీ మార్క్ 119. ఇప్పటివరకు ఎన్డీయే బలం 115గా ఉండగా.. జేడీ(యు) విడిపోవడంతో బలం 110కి తగ్గింది. అంటే మెజార్టీ మార్క్ కంటే 9 తక్కువగా ఉంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాటికి ముగ్గురు నామినెటెడ్ సభ్యులును ప్రభుత్వం రాజ్యసభకు పంపిస్తుంది. ఇక త్రిపురలో ఒక సీటు భాజపాకు ఖాయంగానే కన్పిస్తోంది. అయినప్పటికీ మెజార్టీ మార్క్ కంటే ఎన్డీయే బలం తక్కువగానే ఉంటుంది. దీంతో కీలక బిల్లును ఆమోదింపజేసుకోవాలంటే తటస్థ పార్టీలపై ఎన్డీయే ఆధారపడాల్సి ఉంటుంది.