గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో రాజకీయం చివరి దశకు చేరుకుంది. తాజాగా.. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. వారితో రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్‌లో తాను ఉండబోనని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఆటోడ్రైవర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఏక్‌నాథ్ షిండే 1980 దశకంలో అప్పటి శివసేన థానె అధ్యక్షుడు ఆనంద్ దిగ్జే మద్దతుతో ఆ పార్టీలో చేరారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు షిండే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్‌లో ఆయన మంత్రిగా కొనసాగారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇస్తూ షిండే తిరుగుబాటు చేయడంతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే.