విద్యుత్‌ ఉద్యోగుల విభజన కొత్త చిచ్చు రేపిందా?

-

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్‌ ఉద్యోగులది ప్రముఖ పాత్ర. అసలు అక్కడి నుంచే మలి దశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం మొదలైందని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు తరచూ విద్యుత్‌ సౌధా, మింట్ కాంపౌండ్‌లలో ధర్నాలతో హోరెత్తించేవారు. వీరికి రాజకీయ పార్టీలు మద్దతు కూడా ప్రకటించేవి.. డిమాండ్లు సాధించుకునేవారు. అయితే ఈ ఉద్యోగ సంఘాల నేతలకు.. యాజమాన్యానికి మధ్య గ్యాప్‌ వచ్చిందట..ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయన్నదాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా విభజన చట్టం ఎలక్ట్రిసిటీ యాక్ట్‌కు వర్తించదు. పరస్పర ఒప్పందం..అంగీకారంతో ఏపీ, తెలంగాణలోని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులకు ఆప్షన్స్‌ ఇచ్చి సొంత రాష్ట్రానికి తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. కానీ..కొందరు చేసిన రచ్చకారణంగా సమస్య జఠిలమైందని విద్యుత సౌధాలోనే చర్చించుకుంటారు. ఇప్పుడు ఇదే సమస్య ఇంకో మలుపు తీసుకుంది. అది యాజమాన్యానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య గ్యాప్‌ తీసుకురావడంతో పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ రేపుతోందట.

తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనసాగుతున్నారు. ఒకటిరెండు యూనియన్లు ఆయన్ని కాకా పట్టే ప్రయత్నం చేశాయి. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో.. ఆంధ్ర ఉద్యోగులు ఏపీలో పనిచేయాలి.. తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలనే డిమాండ్‌ చేశాయి సంఘాలు. సీఎం కేసీఆర్‌ దగ్గర యూనియన్లకు మంచి అభిప్రాయం ఉండటంతో సీఎండీ కూడా వారి మాటకు విలువిస్తూ వచ్చారు. విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలోనూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభాకర్‌రావు చెప్పిన పరిస్థితి.

ఇంతలో సమస్య కోర్టుకు చేరడం.. జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిపోయింది. అయితే కమిటీ నిర్ణయం ఇక్కడి ఉద్యోగ సంఘాలకు రుచించలేదు. భవిష్యత్‌ కార్యాచరణపై విద్యుత్‌ సౌధాలో సమావేశం ఏర్పాటు చేసిన యూనియన్లు..యాజమాన్యాలు, సీఎండీ, డైరెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారట. ఆ విషయం తెలుసుకున్న సీఎండీ.. ఉద్యోగ సంఘాల నేతలను దూరం పెట్టారని తెలిసింది. ఇటీవల కొత్త ఏడాది డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణకు హాజరు కావాలని సీఎండీని కోరగా ఆయన తిరస్కరించారట. దీంతో అవాక్కైన యూనియన్‌ నేతలు మంత్రిని ఆశ్రయించి తమ ఆవిష్కరణలు చేయించారు.

అయితే యూనియన్లకు చెందిన పలువురు ఉద్యోగులను సీఎండీ బదిలీ చేశారని… రేపోమాపో ఓ కీలక యూనియన్ నేతకు కూడా స్థాన చలనం జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆరు సంవత్సరాలు సీఎండీ నిర్ణయాలను ప్రభావితం చేస్తూ వచ్చిన సదరు యూనియన్లకు.. ఆ నేతలకు ఇప్పుడు సీఎండీ దగ్గరకు వెళ్లేందుకు కూడా ముఖం చెల్లడం లేదనే విమర్శలు ఇతర యూనియన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news