కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనతో బెంగాల్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. టీఎంసీ నుంచి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు…అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరతారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. అప్రమత్తమయిన దీదీ, ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మమతకు షాక్ ఇవ్వగా..అందులో ఒకరు యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేసిన జితేంద్ర తివారీ తిరిగి రావడంతో మమత ఊపిరిపీల్చుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం కోల్కతా వచ్చిన అమిత్ షా కాసేపటి క్రితమే రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు.
టీఎంసీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని తెలుస్తోంది. మెడినిపూర్ లోని కాలేజ్ గ్రౌండ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారీ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఈ వేదిక మీదనే మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు సువేందు అధికారి బీజేపీలో చేరారు. మమతతో విభేదించిన సువేందు అధికారి గత నెల 27న తన రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అ తర్వాత గత వారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. రెండు రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇవాళ బీజేపీలో చేరారు. ఆయన కాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో పది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ & మాజీ ఎంపి బిజెపిలో చేరారు. ఎమ్మెల్యేలు తపసి మొండల్, అశోక్ దిండా, సుదీప్ ముఖర్జీ, సైకత్ పంజా, శిల్భద్ర దత్తా, దీపాలి బిస్వాస్, సుక్రా ముండా, శ్యామప్దా ముఖర్జీ, బిస్వాజిత్ కుండు & బనశ్రీ మైటీలు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నరు.