ఏపీ రాష్ట్రంలో కోవిడ్ విస్తృతి, నియంత్రణా చర్యలను సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ఎపిడెమోలోజికల్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి సహా 9 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో 8 లక్షల 76 వేల 336 మంది ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడినట్టు పేర్కోన్న ప్రభుత్వం, ఇందులో 8 లక్షల 64 వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వెల్లదించింది.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో కోటి 9 లక్షలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు పేర్కోన్న ప్రభుత్వం, కరోనా కారణంగా 7064 మంది మృతి చెందారని స్పష్టం చేసింది. ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటంతో పాటు కోవిడ్ విస్తృతిని పసిగట్టి అందుకు అనుగుణంగా నియంత్రణా చర్యలు చేపట్టేలా కమిటీకి బాధ్యతలు అప్పచెప్పామని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. నమూనాల సమాచార సేకరణ, విశ్లేషణ, ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాల అమలు చేయనున్నారు.