తెలంగాణలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలోని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli Dayakar Rao ) తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు గ్రామీణ ప్రజల నుండి మంచి స్పందన రావడంతో మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
మండల కేంద్రంలో గాని మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీలో గాని పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఒక బృహత్ ప్రకృతి వనం లో దాదాపు 31,000 మొక్కలను పెంచుతామని, రూ.40 లక్షల వ్యయంతో ఒక్కొక్క ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ఇప్పటివరకు 535 మండలాలలో పది ఎకరాల చొప్పున 5,300 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. మిగతా పది మండలాల్లో భూమి ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తవుతుందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించడానికి 116 కోట్ల రూపాయల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనరుల నిర్మాణాన్ని చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 19,413 (99.9%) పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని , నిర్మాణంలో ఉన్న మిగతా 59 పల్లె ప్రకృతి వనాలను పూర్తిచేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.