వరంగల్ అర్బన్: ఈటల రాజేందర్ ఇవాళ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర పది రోజుల క్రితమే ప్రకటించామని… మా పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే అని పేర్కొన్నారు. కానీ అడుగడుగున అటంకాలు సృష్టిస్తున్నారని… ఓడిపోతామన్న భయంతో ఇలాంటి చిల్లర పనులు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయని మండిపడ్డారు.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మీకు గుణపాఠం తప్పదని… మేము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదు… ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుందని… హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్న ఇతర ప్రాంతాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు… దమ్ముంటే ముందు మీ నియోజకవర్గాల్లో ఈ పథకాలు అమలు చేయాలని సవాల్ విసిరారు.
యావత్ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే తొలి అడుగు ఇక్కడినుంచే పడాలని ప్రజలు భావిస్తున్నారని… ఇక్కడ మాకు అడ్డంకులు సృష్టించాలని, నీచపు పనులు చేయాలని చూస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని చేయడం సరికాదని… చిల్లర వేషాలు వేసేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.