నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. బిజెపి నేత ఈటెల రాజేందర్, టిఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకేసారి ఎదురు కావడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాట మాటా పెరిగింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఈటల రాజేందర్ వాహనం సహా మరిన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనపై ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కావాలనే ఈ దాడి చేయించిందని ఆరోపించారు ఈటల రాజేందర్. టిఆర్ఎస్ కార్యకర్తల దాడిలో 30 మంది బీజేపీ కార్యకర్తలకు పైగా గాయాలయ్యాయని తెలిపారు. తన గన్ మెన్ లు, పీఏలకు కూడా దెబ్బలు తగిలాయని చెప్పారు. దాడిలో 10 నుండి 15 కార్లు కూడా ధ్వంసం అయ్యాయి అన్నారు. కిషన్ రెడ్డితో పాటు తన భార్య జమున ప్రచారాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మునుగోడులో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు ఈటెలెల రాజేందర్.