ప్రభుత్వ అధీనంలోనే ప్రైవేటు ఆస్పత్రులు

-

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తున్న వేళ కోవిడ్‌పై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసత్య ప్రచారాలతో అమాయక ప్రజలను గందరగోళంలో పడేయకూడదని ఆయన కోరారు. కరోనా వ్యాధి సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలసి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో కరోనా పరిస్థితులపై మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కోవిడ్ బాధితులకు సరిపడ ఆక్సిజన్, ఆయా ఆసుపత్రులలో బెడ్లు ఉన్నాయని తెలిపారు. అవసరానికి సరిపడా మందులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. కోవిడ్ బారిన పడిన వారితో పాటు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులపై ఉందని అన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కునే సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిని ప్రభుత్వం స్వాధీన పర్చుకుందని ఖాళీల వివరాలు తెలిపేందుకు డ్యాష్ బోర్డుల విధానం ప్రవేశ పెట్టె ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

మే 1 నుండి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు చెప్పారు. రోజు వారిగా 10 లక్షల పైచిలుకు మందికి వ్యాక్సిన్ ఇవ్వగల శక్తి సామర్ధ్యాలు వైద్య ఆరోగ్యశాఖ కు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజారోగ్యానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలను కాపాడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని కరోనా కట్టడికే రాత్రి పూట కర్ఫ్యూ అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి గాను కర్ఫ్యూ ను విజయవంతం చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news