అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా-భారత్ బలగాల మధ్య ఘర్షణ.. డ్రాగన్ బలగాల కవ్వింపులకు మరో నిదర్శనమని ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం.ఎం నరవణె అన్నారు. ముళ్ల తీగలు, మేకులు కొట్టిన కర్రలతో దాడులకు దిగుతూ చైనా ఆర్మీ.. వీధి రౌడీల స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు. డ్రాగన్‌కు విస్తరణ కాంక్ష బాగా పెరిగిపోయిందన్న జనరల్ నరవణె.. ఇండియన్ ఆర్మీ దానికి దీటుగా సమాధానం చెప్తోందని అన్నారు. వేలాది మంది సైన్యంతో చైనా దూసుకువస్తే కాల్పులు జరపకుండా చేతులు మూసుకుని కూర్చోలేమని జనరల్ నరవణె అన్నారు. 1993 ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తున్న చైనా మాటలు చెప్తూ కూర్చుంటే భారత సైనికులు వినుకుంటూ కూర్చోరని వెల్లడించారు.
” చైనా ఆర్మీ నిబంధనలు అన్నీ ఉల్లంఘిస్తూ.. కాల్పులకు పాల్పడుతున్నారని మమ్మల్ని నిందించలేరు. మీరు 5 వేల మంది సైన్యంతో మా మీదకు దూసుకొస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చోలేం. తప్పకుండా మేము కాల్పులు జరుపుతాం. చైనా సైన్యం తరచుగా ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. చైనా నిబంధనలను తరుచుగా ఉల్లంఘిస్తే మేము నిశ్శబ్ధంగా కూర్చోలేం కదా. నేను ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. భారత సైన్యం వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయి. ఆర్మీ పెట్రోలింగ్‌కు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆపదైనా వస్తుందని భావించి తప్పకుండా ఆయుధాలను తీసుకొనే వెళ్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రైఫిల్, లైట్ మెషిన్‌గన్, మందుగుండు తీసుకునే సైన్యం పెట్రోలింగ్‌కు వెళ్తుంది.”
–జనరల్ ఎం.ఎం. నరవణె, భారత ఆర్మీ మాజీ చీఫ్