కొత్తపల్లి రాజకీయ చరిత్ర ముగిసినట్టేనా ?

-

రాజకీయ వైకుంఠపాళీలో పదవులు అనే నిచ్చెనలు ఎక్కుతున్నంత సేపూ బాగానే ఉంటుంది. కానీ.. ఓటమి అనే కాలసర్పం కాటేస్తే.. పదేపదే అదే అనుభవం ఎదురైతే.. ఎంతటి వారైనా పొలిటికల్‌ స్క్రీన్‌ నుంచి ఫేడ్‌ అవుట్‌ అవ్వాల్సిందే. ఈ జాబితాలో చేరిన రాజకీయ నేతలు తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది ఉన్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.

ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చుట్టూనే తిరిగేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. రెండుసార్లు మంత్రిగా.. పలు దఫాలు ఎమ్మెల్యేగా.. ఒకాసారి ఎంపీగా పనిచేశారు కొత్తపల్లి. అన్ని ప్రధాన పార్టీల్లో పనిచేసిన అనుభవం సంపాదించారాయన. ఈ గోడ దూకుడు వ్యవహారాలే ఆయన్ని నిలకడలేని రాజకీయ వేత్తగా మార్చేశాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో ఉన్నా.. ఎలాంటి ప్రాధాన్యం లేదు. తన సొంత నియోజకవర్గం నరసాపురంలో ఆయన కళ్లముందే అనేక మంది ఎమ్మెల్యేలైపోయారు. ఏ పార్టీలో టికెట్‌ ఆశిద్దామన్నా.. కొత్తపల్లికి పోటీగా అనేకమంది కనిపిస్తున్నారు.

చాలా వేగంగా రాజకీయ కండువాలు మార్చిన కొత్తపల్లికి అదృష్టం వరించి కొన్నిసార్లు పదవులు దక్కాయి. కానీ.. వాటిని పదిల పర్చుకోలేకపోయారు. 1981లో ఇండిపెండెంట్‌గా నరసాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచిన సుబ్బారాయుడు.. తర్వాత టీడీపీలో చేరి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో రెండోసారి గెలిచిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు కొత్తపల్లి. చంద్రబాబు కేబినెట్‌లోనూ పనిచేశారు. మధ్యలో ఒకసారి నరసాపురం ఎంపీగానూ ఉన్నారు. 2009లో పీఆర్పీలో చేరి నరసాపురం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. 2011లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు కొత్తపల్లి. తర్వాత చట్టసభలకు ఆయన ఎన్నికైంది లేదు. 2014లో వైపీపీ నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో.. వైసీపీకి గుడ్‌బై చెప్పి చంద్రబాబుకు జైకొట్టారాయన. కొత్తపల్లి మనవాడే అని అనుకున్నారో ఏమో.. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ను చేశారు చంద్రబాబు.

2019 ఎన్నికల సమయంలో మళ్లీ గోడ దూకేశారు కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేందుకు టీడీపీ నిరాకరించడంతో వైసీపీలో చేరిపోయారు. అయినా టికెట్‌ రాలేదు. వైసీపీ పవర్‌లోకి రావడంతో కేవలం అధికార పార్టీ నాయకుడిగా ఉన్నారంతే. అంతకుమించి ఏ పదవీ లేదు. తన టైమ్‌ బాగోలేదని అనుకున్నారో లేక.. రాజకీయ కప్పదాట్లు చేటు తెచ్చాయని గ్రహించారో కానీ ఎక్కడా కిక్కురుమనడం లేదు కొత్తపల్లి. గతమెంతో ఘనచరిత్ర కలిగిన ఈ మాజీ మంత్రిని చూసినవాళ్లు.. కొత్తపల్లి రాజకీయ చరిత్ర ముగిసిపోయిందనే కామెంట్స్‌ చేయడానికి వెనకాడటం లేదు.

మధ్యలో ఒకసారి కొత్తపల్లి సుబ్బారాయుడు తమ్ముడు కొత్తపల్లి జానకిరామ్‌ నరసాపురం ఎమ్మెల్యేగా చేశారు. అన్నచాటు తమ్ముడిగానే ఉండిపోయారు. అన్న రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటంతో జానకిరాం ఎదగలేకపోయారు. దీంతో కొత్తపల్లి కుటుంబం నుంచి నరసాపురంలో ఎదిగిన మరో నేత లేకుండా పోయారు. ఆ ఖాళీని ఇతరులు భర్తీ చేసేశారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, వైసీపీ నుంచి ప్రసాదరాజు బలంగా పాతుకుపోయారు. జనసేన నుంచి కూడా కొత్త నాయకత్వం వచ్చేసింది. దీంతో కొత్తపల్లి ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇప్పట్లో ఆయన పుంజుకునేది కష్టమని నరసాపురంలోనే చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. కొత్తపల్లి పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news