బీజేపీ షాకింగ్ డిసిషన్ తీసుకోబోతుందా..? ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎంపీ జీ వివేక్‌ను పార్టీ తెలంగాణ చీఫ్‌గా నియమించాలనే నిర్ణయానికి వచ్చిందా..? ఇందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సానుకూలంగా ఉన్నారా..? వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలంటే.. దళితవర్గాలకు పెద్దపీట వేయడమే మార్గమని ఆలోచిస్తున్నారా..? తాజా పరిణామాలు మాత్రం ఔననే అంటున్నాయి. దళితవర్గాల నుంచి కీలక నేతలనుపార్టీలోకి తీసుకుని కీలక పదవులు అప్పగిస్తే.. ఇక తిరుగే ఉండదనే ఆలోచనకు కమలం పెద్దలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
నిజానికి.. పార్టీలో చేరేముందు జీ వివేక్ కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నుంచి కీలక హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆయన అనుచరులు కూడా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహకందని విధంగా తెలంగాణలో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ అదే స్పీడ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలవాలన్న పట్టుదలతో కమలం పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే.. కాంగ్రెస్, టీడీపీల నుంచేగాక అధికార టీఆర్ఎస్ నుంచి కూడా కీలక నేతలను లాగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇక ఇదే అదునుగా.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగి.. వచ్చే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు తగ్గటుగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ మంచి పట్టు లభించిందనే చెప్పొచ్చు.
ఇక రేపో మాపో టీడీపీ మాజీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. మోత్కుపల్లికి కూడా దళితవర్గంలో మంచి పట్టు ఉంది. అంతేగాకుండా.. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో మోత్కుపల్లి దిట్ట. ఈ నేపథ్యంలో మోత్కుపల్లిని తీసుకునేందుకు గతంలో రాష్ట్ర బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే.. మోత్కుపల్లికి కూడా బీజేపీ పెద్దలు గట్టిహామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలోకి తీసుకోగానే.. రాజ్యసభకు పంపిస్తారనే టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో పార్టీలో కీలక పదవి కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. జీవివేక్‌కు ఇప్పటికే జనంలో మంచి ఆదరణ ఉన్న వీ6 టీవీ చానెల్, వెలుగు పేపర్ ఉంది. ఇక ఈ నేపథ్యంలో జీ వివేక్ బీజేపీలో కీలకపాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే టైంలో కేసీఆర్ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి రెండుసార్లు కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు అదే అస్త్రంతో బీజేపీ దళితుడు అయిన వివేక్‌ను తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే ఆ వర్గాల్లో పార్టీ పట్ల సానుకూల సంకేతాలు వెలువడతాయన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది.