దసరా వేడుకల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఏకంగా సీఐ, ఏఎస్ఐపై దాడికి పాల్పాడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బేతవోలు గ్రామ కనకదుర్గమ్మ ఆలయ పరిధిలో మాజీ సర్పంచ్ భర్త వట్టికూటి నాగయ్య మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అటుగా వెళుతున్న ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ అతన్ని వెనక నుంచి తన్నడంతో పాటు ఫొటోలు తీశాడు.
దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. అది కాస్త బీసీ, ఎస్సీ ఇరువర్గాల మధ్య రాళ్లు, పైపులతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది.ఈ ఘర్షణలో మాజీ సర్పంచ్ భర్త నాగయ్య వర్గీయుడి తలపగిలి రక్తస్రావం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదే టైంలో దైవదర్శనం కోసం బేతవోలు గుడికి వచ్చిన కోదాడ టౌన్ సీఐ రాము.. ఇరువర్గాలను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కోదాడ సీఐ, చిరుకూరు ఏఎస్ఐపై ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ దాడి చేసినట్లు తెలుస్తోంది.దీంతో అతనిపై చిలుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.