ఇక్కడ సమంత.. అక్కడ ఆ బాలీవుడ్ స్టార్… ఆందోళనలో ఫ్యాన్స్

-

మయోసైటిస్‌ అనే అరుదైన రుగ్మతతో ఇబ్బందిపడుతున్నానని వెల్లడించి అభిమానులను ఆందోళనకు గురి చేశారు నటి సమంత. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం దీని గురించే చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో మరో నటుడు సైతం తన అనారోగ్య సమస్య గురించి బయటపెట్టాడు. తాను ‘వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌’తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే..

బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటుడు వరుణ్‌ ధావన్‌. ఇటీవల ముంబయిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన అనారోగ్యం గురించి వెల్లడించాడు. ‘‘ఇటీవల నేను ఉన్నట్టుండి బ్యాలెన్స్‌ కోల్పోతున్నాను. నాకు ఏమైందో అర్థం కాలేదు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌తో ఇబ్బందిపడుతున్నానని ఆ తర్వాత తెలిసింది. దాని నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా’’ అని అన్నాడు. అతడి ప్రకటనతో అభిమానుల్లో కంగారు మొదలైంది. నటుడి ఆరోగ్యంపై ఆరా తీస్తూ సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. దీనిపై వరుణ్‌ తాజాగా స్పందిస్తూ.. ‘‘యోగా, స్విమ్మింగ్‌, లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవడంతో ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆ దేవుడి దయ, మీ ప్రేమాభిమానాల వల్ల ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా’’ అని పేర్కొన్నాడు.

వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది ఒక రకమైన రుగ్మత. ఇది ఒక మనిషి బ్యాలెన్స్‌ సిస్టమ్‌పై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారికి తరచూ కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం, వికారం, మైకం, కంగారు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే, తలకు గాయాలైనప్పుడు లేదా మెదడులో రక్తం గడ్డ కట్టినప్పుడు, వయసు పరమైన సమస్యల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

దర్శకద్వయం రాజ్‌ అండ్ డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీమ్యాన్‌- 2’ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు నటి సమంత. ఈ క్రమంలోనే ఈ దర్శకద్వయం సామ్‌, వరుణ్‌ ధావన్‌ జంటగా ఓ ప్రాజెక్ట్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఇంగ్లిషు సిరీస్‌ ‘సిటాడెల్‌’కు రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సాగే ఈ సిరీస్‌ కోసం వరుణ్‌ – సామ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరి, ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version