కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఆ పట్టణంలో అలజడి సృష్టించింది. మస్టార్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనతో పట్టణం రణరంగంలా మారింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించి ఇళ్లకు వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన అన్నదాతలు.. దిష్టిబొమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నేడు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆందోళన ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 గంటలపాటు కలెక్టరేట్ ముందు అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు రైతుల ఆందోళనపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పందించారు. రైతులతో మాట్లాడేందుకు సిద్ధమేనని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ పేర్కొన్నారు. రైతుల ప్రతినిధులు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. రైతులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని అన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.