బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ ప్రభుత్వం చేసిన అప్పీలుపై హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. నిన్న వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న ఏకసభ్య ధర్మాసనం తీర్పును కొట్టివేయటంతోపాటు తీర్పు అమలు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సర్కారు కోరింది.
ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రయత్నం జరిగిందని ఆ విషయాలేమీ ఏకసభ్య ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. తన వాదన వినకుండానే ఏకసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకోవడం తగదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వ అప్పీలుకు విచారణ అర్హతలేదని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇవాళ మధ్యాహ్నం మరోసారి వాదనలు కొనసాగనున్నాయి.