సోషల్ మీడియాలో ఓ వార్త. భూమి పట్టా విషయంలో అధికారులు న్యాయం చేయడం లేదంటూ ఓ రైతు పాదయాత్ర చేపట్టాడు. అదీ.. మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు. దాదాపు 300 కిలోమీటర్ల వరకు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తన గోడును వినిపించుకోవాలన్నది ఆయన తపన. తద్వారా తన సమస్య తీరుతుందన్నది ఆశ. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు జనగా శ్రీనివాస్ గౌడ్ అనే రైతు. సుమారు 60 ఏళ్లు ఉంటాయి. ఆయనకు 15 ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి రికార్డులు, పత్రాలు కూడా ఉన్నాయి. కానీ..2016 లో భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆ భూమిని అధికారులు 13.5 ఎకరాలుగా మార్చేశారు. అప్పటి నుంచి ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
మన అధికారుల సంగతి తెలుసు కదా. అక్కడి కంటే ఇక్కడికని.. మా బాధ్యత కాదంటే మాదికాదని తిప్పించుకుంటున్నారు. అధికారుల తీరుతో విసిగివేసారిపోయిన ఆయన ఇప్పుడు పాదయాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విన్నవిద్దామని అనుకుంటున్నారు. ఆ రైతు పాదయాత్రపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. సెన్సేషన్ గా మారింది. ఓ వైపు ప్రభుత్వమేమో తాము రైతుల కోసమే పరితపిస్తున్నామని అంటోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. రైతు సంఘర్షణ పేరుతో భారీ సభకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
కానీ.. ప్రభుత్వమైనా, విపక్షాలైనా ఇలాంటి సమస్యలను కదా..పట్టించుకోవాల్సింది అని పేర్కొంటున్నారు. ఈ ఒక్క రైతేకాదు.. ధరణితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని.. రైతుల గోసకు ఓ పరిష్కారం చూపితే అదే పెద్ద మేలని అంటున్నారు.