శ్రీశైలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ కు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు శ్రీశైలం డ్యాం సమీపంలోని తలకాయ టర్నింగ్ వద్ద ప్రమాదానికి గురైంది.
వేగంగా వస్తున్న బస్సు మలుపు వద్ద సక్రమంగా ప్రయాణించక ఎదురుగా ఉన్న సైడ్ వాల్ ను ఢీ కొట్టింది. ప్రమాదాలు తరచూ జరిగే స్థలం కాబట్టి ఆర్ అండ్ బి అధికారులు ఆ మలుపుల వద్ద ఇనుప గడ్డర్లతో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. భారీకేడ్ ను ఢీకొన్న బస్సు అక్కడే నిలిచిపోయింది. లేదంటే కింద ఉన్న లోయలోకి పడిపోయి ఘోర ప్రమాదం జరిగిఉండేది. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. బస్సు ఏమాత్రం ముందుకెళ్లిన 100 అడుగుల లోతున ఉన్న లోయలో పడేదని ప్రయాణికులు తెలిపారు.