ఫ్లోరిడాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే.. వీటిని అధికారులు ధ్రువీకరించలేదు కానీ.. ట్రంప్ , ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడి ఇల్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది రక్షణలో ఉంటుంది. తనిఖీలకు కొద్ది సేపటి ముందు సోమవారం ఎఫ్‌బీఐ సిబ్బంది.. సీక్రెట్ సర్వీస్ అధికారులకు వారెంట్ విషయం వెల్లడించారు. దీంతో వారు వారెంట్లను పరిశీలించి అనుమతించారు.
దీనిపై ట్రంప్ కుమారుడు ఎరిక్ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘’ఒక్కసారిగా 30 మంది సిబ్బంది మార్-ఎ-లాగోకు వచ్చారు. వీరు స్థానిక ఎఫ్‌బీఐ ఆఫీస్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారో మీరు అర్థం చేసుకొంటారనుకుంటున్నాను. శ్వేత సౌధం నుంచి వారు వచ్చారు. బైడెన్‌కు ముప్పుగా భావిస్తున్న ట్రంప్‌పై దాడికి వచ్చారు’’ అని పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ట్రంప్ ఈ దర్యాప్తుకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ట్రంప్ ఇంటి నుంచి 15 బాక్సుల్లో పత్రాలు దొరికినట్లు వచ్చిన వార్తపై ఎరిక్ స్పందిస్తూ.. శ్వేత సౌధం ఖాళీ చేసేందుకు కేవలం ఆరు గంటల సమయం మాత్రమే ఉంటుందన్నారు. ఆ సమయంలో ట్రంప్ వద్ద ఉన్న క్లిప్పింగ్‌లను భద్రపర్చారని.. అవే ఆ పెట్టెలని’ పేర్కొన్నారు.
మార్-ఎ-లాగో తనిఖీలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. మార్-ఎ-లాగో ఎస్టేట్‌ను ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకొన్నారని పేర్కొన్నారు. ఇది దేశానికి చీకటి సమయం అని ఆయన అభివర్ణించారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నా.. అనవసరంగా దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ట్రంప్ 2024లో మూడోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ దాడులు జరుగుతున్న సమయంలో ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో ఉన్నారు.