విజయవాడు మేయర్ అభ్యర్థిత్వంపై టీడీపీలో ఇప్పటి నుంచే రాజకీయ సెగలు మొదలయ్యాయి. మేయర్ అభ్యర్థిత్వం తమకే ఖరారైనట్లుగా ఒక వర్గం…ఇదేంటని నిలదీస్తూ మరో వర్గం విజయవాడలో రాజకీయ రచ్చకు తెరలేపుతున్నాయి. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేతకే ఖాయమైనట్లుగా నాని వర్గీయులు కొద్దిరోజులు ప్రచారం చేసుకుంటున్నారు. శ్వేతను రంగంలోకి దించాలని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా వారు శ్రేణుల వద్ద ప్రస్తావిస్తుండటం గమనార్హం. విద్యావంతురాలు కూడా కావడంతో చంద్రబాబు శ్వేతను అభ్యర్థిగా బరిలోకి దించితే బావుంటుందని భావించారని చెప్పుకుంటున్నారు.
శ్వేత విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె ఆమె గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేయడంతో స్థానిక రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. విజయవాడ పార్టీ నేతలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే మేయర్ అభ్యర్థిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్‌రావు సతీమణి అనురాధ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు మేయర్ అభ్యర్థిత్వం దక్కేలా రాంమోహన్‌రావు ఇప్పటికే చంద్రబాబు వద్ద కూడా హామీ తీసుకున్నట్లుగా పార్టీలోని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో కాబోయే మేయర్ శ్వేత గారికి జై అంటూ నాని అనుచరులు హడావుడి చేయడంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి.
దీంతో గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి ఈ విషయంపై విజయవాడ నగర టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్నకు వారు ఫిర్యాదు చేశారు. “మీరు మేయర్ విషయంలో క్లారిటీ ఇవ్వండి“ అంటూ.. ప్రశ్నించినట్టు తెలిసింది.దీంతో ఈ వివాదం ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బుద్దా వెంకన్న కోర్టులోకి చేరింది. వాస్తవానికి ఎంపీ నానికి, బుద్దా వెంకన్నకు మధ్య వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల పాటు ఇరువురు కూడా తీవ్ర విమర్శలు చేసు కున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎలాంటి వైఖరి అవలంభించబోతున్నారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక ఈ విషయాన్ని తాను తేల్చాలా లేక చంద్రబాబు వద్దకే తీసుకెళ్లాలా..? అనే సందిగ్ధంలో బుద్దా ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.