శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్ధి ప్రకటన పెను వివాదానికి దారి తీసింది. రణస్థలం మండలం చిన్నపల్లి రాజాం పంచాయతీకి సంబంధించి కౌంటింగ్ చివరిదశకు చేరుకున్న క్రమంలో టీడీపీ అభ్యర్ధి గెలిచినట్లు ప్రచారం నడిచింది. ఐతే కొద్ది సేపటి తర్వాత వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపధ్యంలో రీకౌంటింగ్ జరిపించాలని టీడీపీ పార్టీ శ్రేణులు పట్టు బట్టారు.
దీంతో టీడీపీ వర్గీయులతో వైసీపీ వర్గీయులు గొడకు దిగారు. ఈ గొడవ ముదిరి ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు బీభత్సం సృష్టించాయి. కర్రలతో ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. గ్రామంలోని ఇళ్లల్లోకి చొరబడి మరీ కొట్టుకున్నారు . గ్రామంలోని ఇళ్లతో పాటు కంటికి కనిపించిన వాహనాల పై దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 30బైక్ లు, 10 ఆటోలు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో గ్రామాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు. గ్రామం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. బయటి వ్యక్తులను ఎవరినీ గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.