పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది జరగనున్న రాజకీయ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పోరాటం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్.. వామపక్ష కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 184 సీట్లు సాధించింది.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో..
2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ అదే జోరును కొనసాగించిందనే చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 సీట్లు గెలుచుకుంది. అందులో వామపక్ష కూటమి కేవలం 32 సీట్లు మాత్రమే సాధించింది. దీంతో మమతా బెనర్జీ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని చెప్పవచ్చు. గ్రామీణ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి, భూసంస్కరణలు, విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర సౌకర్యాలని కల్పించినందుకు గానూ తృణమూల్ గెలుపునకు దోహద పడ్డాయి.
2021 ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో..
దశాబ్దానికి పైగా పశ్చిమ బెంగాల్‌ను ఏలుతున్న తృణమూల్ కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోందని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 లోక్ సభ సీట్లు గెలుచుకోగా.. 2019 ఎన్నికల్లో ఏకంగా 19 సీట్లు గెలుచుకుంది. అప్పటివరకు రాష్ట్రంలో తృణమూల్‌కు పోటీగా వామపక్షాలు, కాంగ్రెస్ ఉండేవి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయ ఫలితాలు సాధించడంతో రాష్ట్రంలో కమలం బలపడుతుందని కాంగ్రెస్, వామపక్షాలు భావించాయి.
పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో క్రమంగా బీజేపీ బలపడుతోంది. బలమైన పార్టీలుగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్‌లు తమ ప్రభావాన్ని కోల్పోయాయి. అయితే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నాయకులు, కార్యకర్తలు బీజేపీ వైపు వెళ్లడంతో బీజేపీ బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.