ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. రాజకీయంగా తన ప్రత్యర్ధులపై మాటల దాడి ఎలా చేస్తారో..అంతకంటే ఎక్కువగానే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదనే చెప్పాలి. ఈయన రాజకీయం చేసినప్పుడు రాజకీయమే చేస్తారు….ప్రజల కోసం పోరాటం చేయాల్సిన సమయంలో గట్టిగా నిలబడి పోరాటం చేస్తారు.
అయితే ఎలాంటి సందర్భమైన సరే ప్రజలకు అండగా నిలబడే విషయంలో రేవంత్ ముందు ఉంటారని చెప్పొచ్చు. ఆ విషయం ఎప్పుడు రుజువు అవుతూనే వస్తుంది. కాస్త వెనక్కి వెళితే..అప్పట్లో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చింది రేవంతే…ఇప్పుడు ధాన్యం కొనుగోలు అంశంలో రాజకీయం చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలని ఎండగడుతూ రైతుల దగ్గరకొచ్చింది రేవంతే.
అసలు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఉత్తరాది రైతులు పెద్ద ఎత్తున పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ఇలాంటి పోరాటాలు ఏమి జరగలేదు. అధికార టీఆర్ఎస్…పార్లమెంట్‌లో మద్ధతు ఇచ్చి, తర్వాత వ్యతిరేకంగా మాట్లాడింది గానీ రోడ్లపైకి వచ్చి పోరాటం చేయలేదు. అటు కాంగ్రెస్‌లో ఇతర నేతలు బయటకు రాకపోయినా సరే, రేవంత్ మాత్రం రోడ్డు మీదకొచ్చారు.
ఒకవేళ సాగు చట్టాలకు కొట్లాడిన తెలంగాణ నేత ఎవరంటే…మొదట రేవంత్ రెడ్డి పేరు ముందోస్తుంది. ఎందుకంటే సాగుచట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత రైతు రణభేరీ బహిరంగ సభను నిర్వహించి అన్నదాతల పోరాటాన్ని కేంద్రం దృష్టికి వెళ్లేలా చేశారు. అలాగే ఢిల్లీలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్‌ను కలిసి వారి దీక్షకు సంఘీభావం తెలిపిన ఒకే ఒక్క తెలంగాణ నేత రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు.
ఇక ఇప్పుడు ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. కానీ ఎవరూ కూడా రైతులని పరామర్శించే కార్యక్రమం చేయలేదు. రేవంత్ మాత్రం పొలాల్లో ఉన్న రైతుల దగ్గరకెళ్లి భరోసానిస్తున్నారు. అంటే అప్పుడు, ఇప్పుడు రైతులకు అండగా నిలబడింది రేవంతే.