ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 2023, మార్చి 11వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో.. ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రశ్నించారు అధికారులు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆప్ పార్టీకి ఇచ్చినట్లు సిసోడియా, పిళ్లయ్, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు. కేసులో విచారణ ఇంకా ముగియలేదని.. మార్చి 16వ తేదీన కవితను మళ్లీ విచారించనున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు.
అయితే.. తొమ్మిది గంటల ఈడీ విచారణ తర్వాత.. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కవిత ముఖంలో చిరునవ్వు కనిపించింది. జై కవిత అంటూ కార్యకర్తల నినాదాల మధ్య.. ఢిల్లీలోని ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి.. గుమ్మడికాయతో దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించారు. కవితను ఆలింగనం చేసుకున్నారు కుటుంబ సభ్యులు. కవిత పక్కన ఆమె భర్త, ఇతర బంధువులు ఉన్నారు. ఉదయం నుంచి పడిన టెన్షన్ ఒక్కసారి మాయం అయినట్లు వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ కీలక నేతలు అందరూ ఎప్పటికప్పుడు లాయర్లతో చర్చిస్తూ ఉన్నారు. ఈడీ చర్యలు ఎలా ఉంటాయి అనే అంశంపై అప్రమత్తంగా ఉన్నారు. ఊహించినట్లు ఏమీ జరగకపోగా.. చిరునవ్వుతో కవిత ఇంటికి రావటంతో.. అందరి ముఖాల్లో సంతోషం వెల్లువెరిసింది. కవితకు హారతి ఇచ్చి.. దిష్టితీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంటి దగ్గర పండగ వాతావరణం నెలకొంది.