రాజకీయాల్లో తొలి విజయం అనేది ఎంతో మరుపురానిది అని చెప్పొచ్చు. అందుకే తొలివిజయం దక్కించుకోవడం కోసం నేతలు తెగ కష్టపడతారు. అయితే ఒకోసారి ఆదిలోనే దెబ్బపడుతుంది.. అలాంటప్పుడు మళ్ళీ పుంజుకుని సత్తా చాటాడానికి చూడాలి. ఇప్పుడు టీడీపీలో కొందరు వారసులు అలా సత్తా చాటాడానికే గట్టిగా ట్రై చేస్తున్నారు. తొలి విజయం సాధించాలని గత ఎన్నికల్లో గట్టిగా ట్రై చేశారు కానీ.. జగన్ దెబ్బకు తొలి పరాజయం ఎదురైంది.
కానీ ఈ సారి ఎలాగైనా తొలి విజయం అందుకోవాలని టీడీపీలోని వారసులు తెగ కష్టపడుతున్నారు. ఇలా తొలి విజయం కోసం కష్టపడుతున్న వారిలో నారా లోకేష్ కూడా ఉన్న విషయం తెలిసిందే. తొలిసారి గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఇక నెక్స్ట్ అక్కడే పోటీ చేసి గెలవాలని లోకేష్ తెగ కష్టపడుతున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. అయితే మారుతున్న రాజకీయాల్లో కొద్దో గొప్పో చినబాబుకు గెలిచే అవకాశాలు మెరుగయ్యాయని తెలుస్తోంది.
ఇక చినబాబు మాదిరిగానే ఇంకా పలువురు వారసులు తొలి విజయం కోసం పాకులాడుతున్నారు. పలాసలో గౌతు శ్యామ్ సుందర్ వారసురాలు, గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష విజయం కోసం కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి పలాసలో ఓడిపోయారు. ఈ సారి అక్కడ నెగ్గి తీరాలనే కసితో పనిచేస్తున్నారు.
ఇక విశాఖలో బాలయ్య చిన్నల్లుడు భరత్ సైతం విజయం కోసం కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు..ఈ సారి అక్కడే పోటీ చేసి ఫస్ట్ విక్టరీ సాధించాలని చూస్తున్నారు. అలాగే పెడనలో కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్, అటు పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్… శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి, నగరిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భాను ప్రకాష్ సైతం ఫస్ట్ విక్టరీ కోసం కష్టపడుతున్నారు. మరి వీరికి నెక్స్ట్ తొలి విజయం దక్కుతుందో లేదో చూడాలి.