ఏపీలో వరుస షాకులతో విలవిల్లాడుతోన్న టీడీపీకి మరో ఐదుగురు కీలక నేతలు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గుడివాడ ఇన్‌చార్జ్, ఏపీ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ వైసీపీలో చేరిపోయాడు. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఇక ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ ఎన్నికల్ల ఓడిపోయిన తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే), వరుపుల రాజా (ప్రత్తిపాడు), నేలపూడి స్టాలిన్‌బాబు (పి.గన్నవరం) ముగ్గురు టీడీపీని వీడారు. ఇక బాపట్లలో ఓడిన అన్నం సతీష్ ప్రభాకర్ సైతం బీజేపీలోకి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలోకి జంప్ చేసేశారు.
ఇక అనకాపల్లి ఎమ్మెల్యేగా ఓడిన అడారి ఆనంద్ వైసీపీ బాట పట్టారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే మరో ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు / నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పార్టీకి గుడ్ బై చెపుతారని పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. విశాఖ జిల్లాలో ఏజెన్సీలో పాడేరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గిడ్డి ఈశ్వరి, అరకులో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ సైతం వైసీపీ వైపు చూస్తున్నారు.
ఇక తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, విశాఖ జిల్లా యలమంచిలి ఇంచార్జ్ పంచకర్ల రమేష్ కూడా ఇతర పార్టీల్లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో టీడీపీకి సరైన నాయకుడే లేకుండా పోయారు. ఇప్పుడు వీరు కూడా పార్టీ వీడితో అసలు అక్కడ టీడీపీ తరపున పోటీ చేసే నాయకులే లేనట్లువుతుంది. ఇక ఈ లిస్టులోకి రేపో మాపో మరికొంత మంది నాయకులు కూడా చేరనున్నట్టు టీడీపీ వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది.