కెనడా టొరెంటోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. టొరెంటోకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని వుఘాన్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు కూడా పోలీసు కాల్పుల్లో చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులకు నిందితుడికి ఉన్న సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాయంత్రం 7.20 సమయంలో వుఘాన్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని యోర్క్ పోలీస్ చీఫ్ జిమ్ మాక్‌స్వెన్ వెల్లడించారు. తమ అధికారి అక్కడకు చేరుకొనే సరికే పరిస్థితి భయంకరంగా ఉందని పేర్కొన్నారు. అక్కడ భవనంలోని చాలా ఫ్లాట్లలో రక్తమోడుతున్న మృతదేహాలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హంతకుడు కూడా మరణించాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు అదే అపార్ట్‌మెంట్‌కు చెందినవాడా.. బయట వ్యక్తా అనే తెలియాల్సి ఉంది.
కుటుంబ సభ్యుల ధ్రువీకరణ లేకుండా మరణించిన వ్యక్తుల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ అపార్ట్‌మెంట్ భవనం నుంచి ప్రజలను బయటకు పంపించిన పోలీసులు.. మరెవరైనా నిందితులు దానిలో ఉన్నారా అనే విషయంపై క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.