భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు.
స్వాతంత్య్ర దినోత్సవం independence day సందర్భంగా మన జెండా గురించి ముఖ్యమైన విషయాలు, నియమ నిబంధనలు Flag Code of India తెలుసుకుందాం.
ఒక్కో దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. దాని వెనుక ఘన చరిత్ర ఉంటుంది. అలాగే మన జాతీయ జెండా వెనుక కూడా చెప్పుకోదగిన ఘన చరిత్రే ఉంది. జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది.
భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య అవడం విశేషం. ఆయన రూపొందించిన జెండానే ఇప్పటికీ మనం వాడుతున్నాం. ఇక మన జాతీయ పతాకానికి సంబంధించి పలు నియమ నిబంధనలను మనం కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే…
- కేవలం ఖాదీ, కాటన్, సిల్క్ వస్త్రంతో మాత్రమే భారత జాతీయ జెండాను తయారు చేయాల్సి ఉంటుంది.
- జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి కచ్చితంగా 3:2 లో ఉండాలి.
- మన జాతీయ జెండాను 6300 x 4200 మిల్లీ మీటర్ల నుండి 150 x 100 మి.మీ. వరకు మొత్తం 9 రకాల సైజ్‌లలో తయారు చేసుకోవచ్చు.
- జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు అది నిటారుగా ఉండేలా చూడాలి. కిందకు వంచకూడదు. వంగితే సరిచేయాలి. అంతేకానీ తప్పుగా జెండాను ఎగురవేయకూడదు. అలాగే మన జాతీయ జెండాను ఎప్పుడూ తలదించుకున్నట్లుగా కాక తల ఎత్తుకున్నట్లుగా ఎగురవేయాలి.
- ప్లాస్టిక్‌ను జెండా తయారీకి వాడకూడదు. కాకపోతే కాగితంతో జెండాలను తయారు చేసుకోవచ్చు. అది కూడా చిన్న సైజ్ జెండాలే అయిఉండాలి.
- కాషాయం, తెలుపు, ఆకుపచ్చ పై నుంచి కిందకు వచ్చేలా జెండాను ఎగురవేయాలి. అలాగే ఆ రంగులు సమాన కొలతల్లో ఉండాలి.
- జెండాలో మధ్యలో ఉండే తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం 24 ఆకులను కలిగి ఉండాలి. అది నీలం రంగులో ఉండాలి.
- జాతీయ జెండాను ఎప్పుడూ సూర్యుడు ఉదయించాకే ఎగురవేయాలి. అలాగే సూర్యుడు అస్తమించకముందే జెండాను దించాలి.
- జాతీయ జెండాను నేలమీద పెట్టకూడదు. నీటిలో వేయకూడదు. జెండాపై ఎలాంటి రాతలు రాయరాదు. అక్షరాలు కూడా ప్రింట్ చేయరాదు.
- ఇతర జెండాలతో జాతీయ జెండాను ఎగుర వేయాల్సి వస్తే జాతీయ జెండా మిగతా జెండాల కన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ప్రదర్శనల్లో జాతీయ జెండా మిగిలిన జెండాల కన్నా కొంచెం ముందుగానే ఉండేలా చూసుకోవాలి.