కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అయింది. కోవిడ్ రాకుండా ఉండేందుకు జనాలు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. శరీర రోగ నిరోధక శక్తిని అనేక రకాలుగా పెంచుకుంటున్నారు. అయితే ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను పలు సూచనలు పాటించాలి. అవేమిటంటే..
1. ప్రాణాయామం
ఊపిరితిత్తులు దృఢంగా మారాలంటే ప్రాణాయం వంటి యోగా పద్ధతులు పాటించాలి. దీంతో శ్వాస సరిగ్గా ఆడడమే కాదు, ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. పొరపాటున కరోనా వచ్చినా తట్టుకునే శక్తి ఊపిరితిత్తులకు లభిస్తుంది.
2. ఆహారాలు
శరీరంలో శ్లేష్మాన్ని (మ్యూకస్) పెంచే ఆహారాలను మానేయాలి. దీని వల్ల ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది. ఊపిరితిత్తుల్లో శేష్మం ఎక్కువగా ఉంటే కరోనా బారిన పడితే ఇన్‌ఫెక్షన్ మరింత తీవ్రతరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలాంటి ఆహారాలను తీసుకోకూడదు. శీతల పానీయాలు అదే కోవకు చెందుతాయి.
3. సప్లిమెంట్స్
శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిచ్చే పోషకాలను తీసుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు ఆయా పోషకాలు ఉండే సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అవి దృఢంగా మారుతాయి. కరోనా వచ్చినా తీవ్రత తక్కువగా ఉంటుంది.
4. కాలుష్య ప్రదేశాలు
కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే వీలైనంత త్వరగా పనిచూసుకుని అక్కడి నుంచి బయట పడాలి. అదే అలాంటి ప్రదేశాల్లో నివాసం ఉండేవారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇతర ప్రదేశాలకు మారిపోవడం బెటర్. లేదంటే దీర్ఘకాలం పాటు కాలుష్యం బారిన పడితే ఊపిరితిత్తులు క్రమేపీ ఇన్‌ఫెక్షన్లకు గురవడమో, అనారోగ్యాలు రావడమో జరుగుతుంటుంది.
5. మాస్క్‌లు ధరించాలి
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ధరించాల్సిందే. దీని వల్ల వైరస్ ముక్కు ద్వారా శ్వాసకోశాల్లోకి ప్రవేశించదు. ఇలా ఊపిరితిత్తులను రక్షించుకోవచ్చు.
6. పొగ తాగరాదు
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పొగ తాగడం మానేయాలి. అందులోనూ కరోనా సమయం కనుక అసలు పొగాకు ఉత్పత్తుల వైపుకు చూడకూడదు. ఈ సూచనలన్నింటినీ పాటిస్తే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.