సమాజంలో ఎక్కడ చూసినా రోజు రోజుకీ స్కాముల బెడద పెరిగిపోయింది. కొందరు అవినీతి పరులు చేస్తున్న స్కాముల వల్ల జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా నకిలీ టీకాల స్కామ్ బయట పడింది. ముంబైలో ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కోవిడ్ టీకాలను వేయించుకునే వారు ఇలాంటి నకిలీ టీకాల స్కామ్‌ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకు కింద తెలిపిన సూచనలను పాటించాలి.
కోవిడ్ టీకాలను ఎవరైనా తక్కువ ధరకే వేస్తామని చెబితే నమ్మవద్దు. ప్రైవేటు హాస్పిటళ్లలో అయితే టీకాలకు కేంద్రం నిర్దేశించిన ధరలను వసూలు చేస్తున్నారు. కనుక ఆ మేర ధర చెల్లించి టీకాలను తీసుకోవాలి. తక్కువ ధరలకే ఆ టీకాలను ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దు. ఇక ప్రభుత్వాలు ఎలాగూ ఉచితంగానే టీకాలను సరఫరా చేస్తున్నాయి. కనుక అలా ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దు.
టీకా వేయించుకుంటానికి కచ్చితంగా ఆరోగ్య సేతు లేదా కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా టీకాలను ఇస్తామంటే నమ్మకూడదు.
టీకా వేయించుకునేటప్పుడు ఏ టీకా వేస్తున్నారో అడిగి తెలుసుకోవాలి. టీకాలను పరిశీలించాలి.
టీకా వేయించుకున్న తరువాత కోవిన్ పోర్టల్‌లో మీరు టీకా తీసుకున్నట్లు అప్‌డేట్ చేస్తారు. అలా కచ్చితంగా చేయించాలి. దీంతో మీరు తీసుకున్న డోసు (మొదటి లేదా రెండు)ను బట్టి మీకు మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
ఇలా పైన తెలిపిన సూచనలు పాటించడం ద్వారా నకిలీ టీకాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.